లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలి- మంత్రి కొప్పుల

184
minister koppula
- Advertisement -

ప్రభుత్వాసుపత్రులపై భరోసా కల్పించే విధంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన కరోనా చికిత్స, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్,ఇతర ఉన్నతాధికారులతో మంగళవారం జూమ్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మొదటి విడత ఫీవర్ సర్వే విజయవంతంగా నిర్వహించామని, ఈ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మందులు అందించామని, దీని ద్వారా కోవిడ్ వ్యాప్తిని తగ్గించుకో గలిగామని మంత్రి తెలిపారు. ఫీవర్ సర్వే సత్ఫలితాలను అందిస్తున్న నేపథ్యంలో రెండో విడత ఇంటింటి సర్వే లో ప్రజాప్రతినిధులు సైతం భాగస్వామ్యం చేస్తూ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే అవసరమైన మేర ఐసొలేషన్ కేంద్రాలు ప్రారంభించాలని, అవసరమైన మందులు ఆక్సిజన్, రెమిడిసివిర్ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల తోపాటు ప్రైవేట్ ఆసుపత్రిలో సైతం చికిత్సకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ నియమాల మేరకు మాత్రమే ప్రజల నుండి ఫీజులు వసూలు చేయాలని, ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స ఫీజులపై నియంత్రణ ఉంచాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.కరోనా సమయంలో సిటీ స్కాన్ అవసరం అవుతుందని నిర్వాహకులు అధిక ఫీజులు వసూలు చేయకుండా, ల్యాబ్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి హెచ్చరించాలని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల్లో వసతి, మందులు, భోజనం మరియు డాక్టర్ లో అందిస్తున్న వైద్య సేవలపై ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.

కోవిడ్ మహమ్మారి నియంత్రణ కోసం పెద్దపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తుందని, జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 4,800 యాక్టివ్ కేసులున్నాయని, పాజిటివ్ రేటు 25 శాతం ఉందని జిల్లా కలెక్టర్ డా.సంగీత సత్యనారాయణ వివరించారు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లా ఆస్పత్రి నిర్వహణపై దృష్టి సారించాలని, ప్రజలకు అందించే భోజనం పై అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. జిల్లాలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై దాదాపు 15 వేల కేసులు నమోదు చేశామని డిసిపి రవీందర్ వివరించారు.

జడ్పీ చైర్మన్ , ఎం.పి., ఎం.ఎల్.ఏ.లు పెద్దపల్లి, రామగుండం మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ టెస్ట్ ల సంఖ్య పెంచాలని, కరీంనగర్ ఆసుపత్రికి పంపించే పేషెంట్ లకు బెడ్ సౌకర్యం కల్పించాలని మంత్రి కి వివరించారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధు ,ఎం.పి. వెంకటేష్ నేత ,జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఎం.ఎల్ ఏ లు పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం కోరుకంటి చందర్ ,అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి రవీందర్ ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ సంబంధిత అధికారులు ,తదితరులు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

- Advertisement -