దేశానికే ఆదర్శంగా రైతు సంక్షేమ పథకాల అమలు..

210
Koppula Eshwar
- Advertisement -

రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి మార్కెట్ కమిటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశానికే ఆదర్శవంతంగా మన రైతాంగాన్ని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని అన్నారు. రైతు అభ్యున్నతిలో రైతు బంధు సమితి సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంట వివరాలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సదరు పంటలు రైతులు సాగు చేసే దిశగా, గిట్టుబాటు ధర సాధన దిశగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లు ఖర్చు చేసి 2601 రైతు వేదికలను నిర్మించామని, ప్రపంచంలో ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలో మాత్రమే జరిగిందని తెలిపారు.

దేశానికే ఆదర్శంగా రైతు సంక్షేమ పథకాల అమలు..
నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 6 మాసాలలో విద్యుత్ సమస్యను అధిగమించి రైతులకు నాణ్యమైన 3 ఫేస్ విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా రైతులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తెలిపారు. తొలి దశలో రూ.17 వేల కోట్ల రుణమాఫి చేసామని,మలిదశలో రూ.25 వేలలోపు ఉన్న రైతుల రూ.1500 కోట్లు జమ చేసామని, మరో విడత రుణమాఫి చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ప్రతి సంవత్సరం రూ.1200 కోట్లు ఖర్చు చేసి రైతుకు భద్రత కల్పించే దిశగా రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని, ఏ కారణం చేత రైతు మరణించినా వారి కుటుంబాన్నీ ఆదుకునే దిశగా రూ.5 లక్షల అందిస్తున్నామని తెలిపారు. దేశంలో మొదటిసారిగా రైతులకు పెట్టుబడి అందించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మని, కరోనా సంక్షోభ సమయంలో సైతం వానాకాలం పంటకు సుమారు 58 లక్షల మంది రైతులకు రూ.7200 కోట్ల రైతు బంధు నిధులు అందించామని మంత్రి అన్నారు. యాసంగి పంటకు సంబంధించి డిసెంబర్ 27 నుంచి రెండవ విడత కింద మరో మారు రైతులకు రూ.7200 కోట్లు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. రైతు భూ హక్కులను సంపూర్ణంగా రక్షించేందుకు వారికి ఉన్న సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రుపొందించామని తెలిపారు. పూర్వ కాలంలో జమిందార్లు, జాగిర్దార్లు ఉండేవారని, ప్రస్తుతం 95% పైగా రైతులు 5 ఎకరాలోపు ఉన్న చిన్న సన్నకారు రైతులను, వారికి ఇబ్బంది కల్గించే విధంగా అనుభవదారు కాలంను పూర్తిగా తొలగించామని తెలిపారు.

అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
రైతు సంక్షేమం కోసం నిర్వీరామంగా పనిచేస్తున్న ప్రబుత్వం పట్ల కొంత మంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి ఆవలంభిస్తుందని, రైతులపై కేంద్రానికి ప్రేమ లేదని అన్నారు. వడ్ల కోనుగొలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంస్థ పుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా భయంకరమైన ఆంక్షలు విధించిందని, ధాన్యం కేవలం రూ.1888/- మాత్రమే కొనుగొలు చేయాలని, అధిక ధరకు కోనుగొలు చేస్తే తాము సేకరించమని దుర్మార్గమైన వైఖరి అవలంభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం సైతం పూర్తి రైతు వ్యతిరేక చట్టమని మంత్రి అన్నారు. రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజేక్టులు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నామని, కాళేశ్వరం వంటి భారి ఎత్తిపోతల పథకం నిర్మించామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం లక్ష కళ్లాలను సైతం నిర్మించామని,వచ్చే సంవత్సరం మరిన్ని కళ్లాలు నిర్మిస్తామని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో సైతం ప్రజా సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత విధించ లేదని, కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.6 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ సహయం నిధులు విడుదల చేసామని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మమతా రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, పెద్దపల్లి మార్కెట్ కమిటి చైర్మన్ శంకర్ నాయక్,వైస్ చైర్మన్ సురేందర్, ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, మార్కెట్ కమిటి సభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -