రైతు ద్రోహి బీజేపీ పార్టీ- మంత్రి జగదీష్ రెడ్డి

53

కిషన్ రెడ్డిది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదు- ప్రజలను మోసం చేసే యాత్ర అని మంత్రి జి.జగదీష్ రెడ్డి ఎద్దేవ చేశారు. శుక్రవారం ఆయన టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలైనా – ర్యాలీలు చేసుకోవచ్చు. కానీ కిషన్ రెడ్డి వాస్తవాలు చెప్పకుండా గాలి మాటలు చెప్తున్నారు. 70 రూపాయలు ఉన్న పెట్రోల్- డీజిల్ ను వంద దాటించినందుకు ఆశీర్వదించాలని ప్రజలను అడగాలి. కిషన్ రెడ్డిది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదు- ప్రజలను మోసం చేసే యాత్ర. కిషన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చలేదు. బీజేపీ దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పే స్కిల్ నేర్పిర్రు తప్ప అభివృద్ధి స్కిల్ నేర్పలేదు అని మంత్రి విమర్శించారు.

నల్లడబ్బు తెస్తా అన్న బీజేపీ మాటలు విన్న ప్రజలు తెల్లడబ్బులు కూడా పోగొట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 2వేల రూపాయల పెన్షన్స్ ఎక్కడైనా ఇస్తున్నారా?..కనీసం మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోనైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పథకాలు కాపీ కొట్టడమే కాకుండా దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో పూర్తిగా అమలు చేయడం లేదు. మేము పైనుంచి తీసుకొచ్చి పెట్టలేదు- మేమంతా ప్రజలు ఎన్నుకున్నవాళ్ళమే. బీజేపీ రాష్ట్రాలకు ఇస్తున్న డబ్బులు పాకిస్తాన్ నుంచి తెచ్చి ఇస్తున్నారా? మా వాటా కూడా పూర్తిగా ఇవ్వడం లేదు కదా? కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడ దుర్వినియోగం చేస్తున్నామో కిషన్ రెడ్డి చెప్పాలి. బీజేపీ నాయకులు పార్లమెంట్‌లో ఒకలాగా- బయట మీడియా ముందు ఒకలాగా మాట్లాడుతున్నారని మంత్ర దుయ్యబట్టారు.

ఎన్నికల హామీలపై బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమా?..రాబోయే రోజుల్లో బీజేపీకి దేశం ప్రజలు షాక్ ఇస్తారు సిద్ధంగా ఉండండి. ఒక్కొక్క చట్టం తీసుకొచ్చి దేశ ప్రజలపై బీజేపీ చేసే దాడులు చాలవా? కొత్తగా మళ్ళీ వేరే దాడులు జరగాలా? అని మండిపడ్డారు. రైతు జేబులు కొట్టే చట్టాలు తెస్తున్న రైతు ద్రోహి బీజేపీ పార్టీ. కొత్తగా తెచ్చిన రైతు చట్టాల వల్ల దేశరైతుల నడ్డి విరుస్తుంది బీజేపీ అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడం బీజేపీ నేతలతో కాదు. కేంద్రమంత్రి స్థాయిలో ఉండి గాలి మాటలు మాట్లాడొద్దని మంత్రి తెలపారు. మేము చెప్పే మాటలకు ఆధారాలు చూపిస్తాం- కిషన్ రెడ్డి తను చెప్పే మాటలకు ఆధారాలు చూపిస్తారా?.. నోటికి ఏది తోస్తే అది చెప్తే ప్రజలు నమ్మి ఓట్లు వెయ్యరు అని మంత్రి పేర్కొన్నారు.

చట్టబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నిధులకంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి నిరూపిస్తరా? రేపటి నుంచి అయినా కిషన్ రెడ్డి నిజాలు ప్రజలకు చెప్పాలి. డీజిల్ ధర వంద దాటిందా లేదా అని మోడీ కారు డ్రైవర్ ను అడుగుతే చెప్తారు!. అబద్ధాలు ఆడటం బీజేపీ అలవాటు- అర్థంలేని మాటలు చెప్పడం బీజేపీ నాయకులకు అలవాటు. మహారాష్ట్ర- కర్ణాటక – ఏపీ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో తాలిబన్లు ఉన్నారు అంటే మోడీ- బీజేపీ ఫేల్యూర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. బీజేపీ ప్రభుత్వానికి సరిహద్దుల దగ్గర కాపాలా రాకపోతే తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలి. దేశంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్- శాంతిభద్రతలు కాపాడటంలో టి- పోలీస్ నెంబర్ వన్. నిజం ఒప్పుకున్నదుకు మురళీధర్ రావుకు ధన్యవాదాలు మంత్రి అన్నారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ ,బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.