మోడీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి..

133
Minister Jagadish Reddy
- Advertisement -

విద్యుత్ సరఫరా అంశంలో తెలంగాణా గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.కేంద్రప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి అనడానికి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థలపై కేంద్రం పెంచిన ఒత్తిడినే నిదర్శనంగా మారిందని ఆయన దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరాలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే మోడీ సర్కార్ ఈ కుట్రలకు తెరలేపిందని ఆయన విమర్శించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తనను కలిసిన మీడియాతో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం అంటూ ఏర్పడితే రానే రాదు అనుకున్న విద్యుత్‌ను రాష్ట్రం ఏర్పడిన మూడేండ్లకే అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రాంగ తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు. యావత్ భారత దేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ,ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. దీన్ని చూసి తట్టుకోలేక బిజెపి పాలకులు కేంద్రప్రభుత్వం ద్వారా వాళ్ళ కుట్రలను అమలు పరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఖర్చుకు వేనకాడకుండా ఎంతటి తిప్పలు పడైనా సరే విద్యుత్ సరఫరాకు కొనసాగించాలన్న దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు.అందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ సంస్థలపై ఒత్తిడి పెంచి విద్యుత్‌ను అమ్మనియకుండా బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.

కొంత కాలం మౌఖిక ఆదేశాలతో తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ ను అమ్మనియకుండా కేంద్రమంత్రి చేసిన ఒత్తిడిని ఖాతర్ చెయ్యక పోవడంతో రంగంలోకి దిగిన కేంద్రప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. ప్రయివేటు ఉత్పత్తి దారులకు బాకి ఉంటే వాళ్ళతో ఫిర్యాదు చేపించి సరఫరాను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేస్తాం అంటూ దాదాగిరికి దిగుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఒక రకంగా చెప్పాలి అంటే కేంద్రం దాదాగిరి వీధి రౌడిజాన్ని మర్పిస్తున్నదని ఆయన విరుచుకుపడ్డారు. వాస్తవానికి విద్యుత్ కొనుగోళ్ల అంశంలో కేంద్రానికి కానీ యన్.ఎల్ డి.సి,యస్.ఎల్ డి సి లకు నిమిత్త మాత్రం సంబంధం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చిచెప్పారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఎంత లోడ్ పడుతుంది… ఎక్కడ ఎంత అవసరం ఉంటుంది..ఏ ప్రాంతంలో ఎంత విద్యుత్ వినియోగం ఉంటుంది…ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ ఫార్మ్ చెయ్యాలి అన్నదే లోడ్ డిస్పాచ్ సెంటర్ ల విధి అని ఆయన స్పష్టం చేశారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందం అనేది ఉత్పత్తి దారులకు,ఆయా డిస్కం,ట్రాన్స్కో,జెన్కో ల మధ్య ఉంటుందన్నారు.ఇందులో కేంద్రప్రభుత్వం, ఎల్‌డిసి ల పాత్ర ఉండదన్నారు.ఉత్పత్తి దారులకు కొనుగోలు దారులు బాకి పడితే సరఫరా నిలిపే హక్కు ఆ ఉత్పత్తి దారులకు మాత్రమే ఉంటుందన్నారు.కాదు అనుకుంటే ఈ ఆర్‌సి కి వెళ్లే వేసులు బాటు ఉంటుందన్నారు. అదేమీ పట్టించుకోకుండా దాదాగిరికి దిగిన కేంద్రప్రభుత్వం వీధి రౌడిజాన్ని ప్రదర్శిస్తుందన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో వ్యవసాయానికి కనీసంలో కనీసం ఆరు గంటల కుడా విద్యుత్ సరఫరా చెయ్యలేక చేతులెత్తిసిన అక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు అధికారికంగా రెండు రోజులు అనధికారికంగా మరో రోజు కోతలు విదిస్తుందన్నారు.మోడీ సొంత రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడ కుడా విద్యుత్ సరఫరా మెరుగు పడలేదని ఆయా రాష్ట్రాల ప్రజలు తెలంగాణను నమూనాగా తీసుకుని నిలదిస్తారనే భయంతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -