కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు దక్కవు- మంత్రులు

108
trs
- Advertisement -

నిడమానూరు మండలంలో నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా మంత్రులు జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనసభ్యులు యన్. భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలకు డిపాజిట్లు దక్కడం గగనమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ నియోజకవర్గ ప్రజలు 2018లో అందించిన మెజార్టీకి రెట్టింపు అందించేందుకు సన్నద్ధమవుతున్నారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలసి గురువారం ఉదయం నుండి నియోజకవర్గ పరిధిలోని నిడమనూర్ మండల పరిధిలో ఊట్కూరు,లక్ష్మిపురం, నంది కొండోరిగూడెం,మారుపాక తదితర గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రేపటి ఎన్నికల్లో ఇక్కడ ఎగిరెది గులాబీజెండానేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ పాలన అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని,పెరిగిన వంటగ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలే అందుకు కారణమన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు పడకల ఇండ్లు కట్టించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారని ఆయన తెలిపారు. మొన్నటి బడ్జెట్‌లో 11 వేల కోట్ల నిధులు రెండు పడకల ఇండ్ల నిర్మాణాలకు కేటాయించిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఉటంకించారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే తెలంగాణా రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలే టీఆర్ఎస్ ప్రధాన ఎజెండా లన్నారు. అందుకు అనుగుణంగా పాలన సాగుతోందని యావత్ భారతదేశంలొనే కాకుంటా ప్రపంచ చిత్ర పఠంలో తెలంగాణా కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు నిర్ణయాలే కారణమన్నారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో సబ్బండ వర్గాలు ఎదురువచ్చి స్వాగతం పలకడమే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ విజయానికి సంకేతమన్నారు. ఎన్నికల అనంతరం జానారెడ్డి జాడ లేకుండా పోతారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని, అభివృద్ధికి పట్టం కట్టాలని ఇక్కడి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. చరిత్రను సృష్టించడం అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సొంతం అన్నారు. అటువంటి చరిత్ర సాగర్ ఉప ఎన్నికల్లో పునరావృతం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -