నిర్మల్ జిల్లా జౌలి గ్రామస్థుల దశాబ్దాల కల నెరవేరింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామిలో భాగంగా స్వర్ణ ప్రాజెక్ట్ వద్ద రూ.90 లక్షల వ్యయంతో నిర్మించిన లో-లెవల్ కాజ్ వే ను అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్వర్ణ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడే ఇక్కడ లో-లెవల్ కాజ్ వే నిర్మించి ఉంండాల్సింది. కానీ వంతెన లేకపోవడంతో జౌలి గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ఎన్నికల హామీ మేరకు గతేడాది లో-లెవల్ కాజ్ వే నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, ఏడాదిలోనే వంతెన నిర్మాణం పూర్తైందని తెలిపారు. లో-లెవల్ కాజ్ వే అందుబాటులోకి రావడంతో జౌలి గ్రామస్తులకు ప్రత్యేకించి రైతులకు, విద్యార్థులకు దూర భారం తగ్గుతుందని వివరించారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధన్యతనిస్తురన్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా ద్వారా రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 15 నుంచి రైతులకు రైతుబంధు నగదు నేరుగా వారి ఖాతాలోనే జమా కానుందని పేర్కొన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. దాదాపుగా కొనుగోలు ప్రక్రియ పూర్తైందన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలకు మించి వరి సాగు కావడంతో పంట దిగుబడి ఎక్కువగా వచ్చిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టిన లక్ష్మినర్సింహా స్వామి ప్యాకేజీ-27 కాల్వ నిర్మాణం పూర్తైతే ఆయకట్టు క్రింద ఉన్న రైతులకు రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు ఉంటాయని చెప్పారు. చెక్ డ్యామ్‌ల వల్ల వాగులు, వంకలు కొండల పైనుంచి వృథాగా పోతున్న నీటిని నిల్వచేసి రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కు వ చెక్‌డ్యామ్‌లు మంజూరు చేసుకున్నామన్నారు. చెక్‌డ్యామ్‌ల వల్ల పరిసర ప్రాంతాల్లోని రైతులకు భూగర్భ జలాలు పెరిగి వారికి సాగు నీటి కష్టాలు తీరనున్నాయని మంత్రి వెల్లడించారు.