తెలంగాణలో అటవీ శాతం 3.67 శాతం పెరిగిందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి , బాల్క సుమన్, రేఖా శ్యాంనాయక్ హరిత హారం కార్యక్రమంపై అడిగిన ప్రశ్నలకు ఇంద్రకరణ్ రెడ్డి సమాధానం ఇచ్చారు.
నాటిన మొక్కల సంరక్షణ, వాటిని బ్రతికించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించాం… నాటిన మొక్కల్లో 85% మొక్కలను బ్రతికించుకోవాలనే ఉద్దేశ్యంతో మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాల్లో సవరణ చేయడం జరిగిందని అన్నారు. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలీటీల్లో మొక్కలు నాటి సంరక్షించేందుకు వార్షిక బడ్జెట్ లో 10% హరిత బడ్జెట్ గా ప్రత్యేకంగా కేటాయిస్తున్నామని తెలిపారు.
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి హైదరాబాద్ ను ట్రీ సిటీ ఆఫ్ ఇండియాగా గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు హరిత హారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యం కాగా ఇప్పటవరకు 217.406 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు.