ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న వంట నూనెల వల్ల భారతదేశంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సొన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ పామ్ మొక్కల సాగును మంత్రి ప్రారంభించారు. 10 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయిల్ పామ్ సాగు ప్రాధాన్యతను మంత్రి రైతులకు వివరించారు.
ప్రస్తుతం మార్కెట్లో వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం స్థానికంగా ఆయిల్ ఉత్పత్తి తగ్గడమే కారణమని అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. నిర్మల్ జిల్లాలో పదివేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ తోటలను, కర్మాగారాన్ని ఇక్కడి 300 మంది రైతులతో సందర్శించడం వల్ల చాలా మంది రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు ముందుకు వచ్చరన్నారు.
సారంగపూర్ మండలం బీరవెల్లి, ఆర్మూర్ చేపూర్ గ్రామాల్లో నర్సరీ లను పెంచి రైతులకు మొక్కలను అందుబాటులో ఉండటం జరిగిందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు సబ్సిడీతో పాటు స్లింకర్లు, డ్రిప్ వంటి సదుపాయాలను అందిస్తున్నామని పండిన పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులకు ఎలాంటి నష్టాలు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో నిర్మల్ జిల్లాలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.