హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు సీఎం కేసీఆర్. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రి హరీశ్ రావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా మాట్లాడారు. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను ఆప్యాయంగా పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్.. మీకు నేనున్నాంటూ భరోసా కల్పించి, ధైర్యం చెప్పారు.
గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు హరీశ్ రావు సైతం కరోనా బాధితుల దగ్గరికి వెళ్లి పలకరించారు. తనకు కరోనా వచ్చింది.. కొలుకున్నాను…మీరు కరోనాను జయిస్తారు.. !! అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు.
అలాగే ఐసీయూలో చికిత్స పొందుతున్న 20 మంది కోవిడ్ పేషెంట్ల బాగోగులను , వైద్యం , భోజన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల ఆసుపత్రిని కలియ తిరిగిన హరీశ్…. ఆసుపత్రి లోపల, ఆసుపత్రి పరిసరాలను నిరంతరం క్లీనింగ్ చేసేలా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కు ఆదేశాలు జారీ చేశారు.