పనిచేసే ప్రభుత్వానికి అంగన్వాడీలు అండగా ఉండాలని, అంగన్ వాడీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు అన్నారు.ఆదివారం హుజురాబాద్ పట్టణంలో అంగన్ వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో పోరాటాలు చేస్తే కూడా జీతాలు పెంచని దుస్థితి ఉండేదని, ధర్నాలు చేస్తే గుర్రాలతో తొక్కించిన ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అంగన్ వాడీల జీతాలు 7 సంవత్సరాల్లో 3 సార్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.
భారత దేశ చరిత్రలోనే కాంట్రాక్టు, ఇతర చిన్న ఉద్యోగులకు కుడా ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లు గానే జీతాలు పెంచుతున్నా మన్నారు. అంగన్వాడీలకు గుజరాత్ రాష్ర్టంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో మనం ఇస్తున్న జీతంలో సగం కూడా ఇవ్వడం లేదన్నారు. అంగన్ వాడీ జీతాలు కేంద్రం ప్రభుత్వం ఇస్తుందని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ పచ్చి అబద్ధాలు, కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 2700 మాత్రమేనని, రాష్ట్రం ఇచ్చేది 10950/- అని స్పష్టం చేశారు.
అంగన్ వాడీలకు మొదటి వారంలోనే జీతాలు వచ్చేలా చూస్తానని, 450 మంది అంగన్ వాడీ లకు సూపర్ వైజర్లుగా ప్రమోషన్స్ ఇప్పిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అర్హులైన అంగన్ వాడీలకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి 4000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సీఎం కేసీఆర్ మంజూరు చేస్తే, ఒక్క ఇల్లు కట్టి లభ్డిదారులకు ఇవ్వలేదు, దానికి బాద్యులు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ది కదా, అని హరీష్ రావు ప్రశ్నించారు.
పని చేసే వ్యక్తికి మద్దతు ఇవ్వండి, తెలంగాణ, కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాన్నారు. ఆసరా పింఛన్లు, రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ని అపహాస్యం చేసిన వ్యక్తులు ఎవరో మీకు తెలుసు, ఈ పథకాలను పరిగే అన్న వ్యక్తి, మీ మాజీ ఎమ్మెల్యే అన్నారు.అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామన్నారు. ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం వంట గ్యాస్ ధరలు పెంచి వచ్చే సబ్సిడీని తగ్గించిందని ఆరోపించారు. అంగన్ వాడీ సమస్య ల్లో నా పరిధిలో ఉన్నవి పరిష్కరిస్తా. మిగతా సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి శ్రీ గంగుల కమలాకర్ మాట్లాడుతూ అంగన్ వాడీ లు చేసేది ఉద్యోగం కాదని సమాజ సేవ అని కీర్తించారు, వారికి ఎంత జీతం ఇచ్చిన తక్కువే అని గ్రహించిన సీఎం కేసీఆర్, జీతాలు పెంచారన్నారు. అంగన్వాడీలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని. తెలంగాణ వచ్చాకే వారికి జీతాలు పెంచారన్నారు. కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీలు ఉద్యమం లో ఎక్కువ భాగస్వామ్యం అయ్యారని. వారి కృషి గొప్పదన్నారు.ఈ సభలో మాజీ మంత్రి శ్రీ ఇనుగాల పెద్దిరెడ్డి, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.