హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడుతుండడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించి హుజురాబాద్‌ను సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని పట్టుదలగా ఉన్న మంత్రి హరీష్‌రావు పెంచికల్ పేట్ వేదికగా చక్రం తిప్పుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఓ పక్క తనతో సహా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర అగ్రనేతలతో ప్రచారం చేయిస్తూనే..మరోపక్క హుజురాబాద్‌లో వివిధ సామాజికవర్గాల వారీగా ఓటు బ్యాంకును టీఆర్ఎస్‌వైపు మళ్లేలా పక్కా వ్యూహాలు రచిస్తూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ ఉండడంతో దానికి ఆనుకుని ఉండే హనుమకొండ జిల్లాలోని పెంచికల్ పేట్ వేదికగా ఈటలను ఓడించేందుకు హరీష్‌రావు టీఆర్ఎస్ అగ్రనేతలతో కలిసి రచిస్తున్న వ్యూహాలు ఈటలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. హనుమకొండ జిల్లాలోని పెంచికల్ పేట లో టీఆర్ఎస్ పార్టీ సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తోంది. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , ఎంఎల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఈ ఆత్మీయ సమావేశాలను పర్యవేక్షిస్తున్నారు. హుజూరాబాద్ లో కులాలవారీగా ఎవరి జనాభా ఎంత ? వీరిలో పట్టున్న నేతలెవరు ? వ్యక్తులెవరు అన్న విషయాలపై దృష్టి పెట్టిన హరీష్‌రావు వారితో భేటీలు అవుతూ గెల్లుకు ఓటేయాల్సిందిగా కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెల్లును గెలిపిస్తే ఆయా సామాజికవర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని గట్టి హామీ ఇస్తున్నారు. హుజురాబాద్‌లో బీసీల ఓటు బ్యాంకు అధికంగా ఉంది..ఆ తర్వాత దళితులు, రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బీసీల్లో మున్నూరు కాపు, పద్మశాలీ, యాదవ, గౌడ, ముదిరాజ్‌లతో సహా పలు ఉపకులాలు ఎక్కువ. బీసీల ఓట్లే గెలుపు ఓటముల్లో కీలకం కావడంతో హరీష్‌రావు స్పెషల్ ఫోకస్ పెట్టారు. బీసీ సామాజవర్గాలకు వరాలు జల్లు కురిపిస్తూ గెల్లుకు మద్దతు ఇచ్చేలా తీర్మానాలు చేయిస్తున్నారు. అలాగే ఎస్సీల్లో మాల మాదిగ సామాజికవర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. దళితబంధు పథకం దళితులందరికీ వస్తాయని, ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ఆత్మీయ సమావేశాల్లో హరీష్‌రావు భరోసా ఇస్తున్నారు. ఇక రెడ్డి సామాజికవర్గంలో ప్రముఖులతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. మొత్తంగా పెంచికల్‌పేట్‌లో వేదికగా హరీష్‌రావు అమలు చేస్తున్న వ్యూహాలు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు వేస్తున్నరు.
హరీష్ మాస్టర్ స్కెచ్..ఈటలకు ముచ్చెమటలు..!
- Advertisement -
- Advertisement -