రాష్ట్రానికి 723 కోట్లు విడుదల చేయాలి- మంత్రి హరీష్‌

142
harish

42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో ‌నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో పాటు హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ నుండి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ..జీఎస్టీ కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది…ఇప్పటి వరకు కౌన్సిల్ లో ఏ నిర్ణయం జరిగినా సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకునే వారు‌. కాని తొలి సారి జీఎస్టీ కౌన్సిల్ ఏక పక్ష నిర్ణయం తీసుకుంది.తెలంగాణ రాష్ట్రం మాత్రం మొత్తం పరిహారాన్ని కేంద్రం చెల్లించాలన్న డిమాండ్ కు కట్టుబడి ఉంది.1 లక్ష 83 వేల కోట్లు జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిన చోట లక్ష పది వేల కోట్లు చెల్లిస్తామని, ఈ మొత్తాన్ని రాష్ట్రాలే రుణం తీసుకోవాలని చెప్పి సమావేశాన్ని ఏక పక్షంగా ముగించింది.తెలంగాణ మాత్రం కేంద్రమే మొత్తం పరిహారాన్ని అప్పు తీసుకుని చెల్లించాలన్న విషయానికి కట్టుబడి ఉందన్నారు.

ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ‌ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలి. ఈ పరిహారం తప్పనిసరిగా పరిహార నిధి నుండే చెల్లించాలి. సెస్ తో పాటు, జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమ చేయాలని మంత్రి తెలిపారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2 కింద పేర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్ 10(1) చెబుతోంది. దీని పైన జీఎస్టీ కౌన్సిల్ చర్చించవచ్చు.

ఆప్షన్ 1 లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్ష పది వేల కోట్లకు, ఆప్షన్ 2లో‌ లక్ష 83 వేల కోట్లు కు రివైజ్డ్ చేయడం జరిగింది. వీటి మధ్య అంతరం 73 వేల కోట్లు మాత్రమే. ఇదేమి పెద్ద మొత్తం కాదు. ఆప్షన్ 1లో పేర్కొన్న పరిహారంతో పాటు ఈ 73 వేల కోట్లు చెల్లించాలి అని మంత్రి కోరారు. ఈ సమావేశంలో చత్తీస్‌గఢ్ మంత్రి చెప్పినట్లు, జీఎస్టీ పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం ఆర్టికల్ 293 పరిధిలో ఉండదు. దీన్ని సమర్థిస్తున్నాను అని మంత్రి హరీష్‌ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 2.43 నుంచి 2.13కు తగ్గించింది.

కేంద్రం ఈ రోజు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఫైనాన్స్ కమిషన్ ఫార్ములా ఆధారంగా ఈ ప్యాకేజీ ఇవ్వడం‌వల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఈ రోజు ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్రాల జనాభా, ఆయా రాష్ట్రాల మూలధన వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. దీని వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మేలు జరుగుతుంది. 15 వ ఆర్థిక సంఘం డెవెల్యూషన్ గ్రాంట్ 2.43 నుంచి‌ 2.13 తగ్గించడం వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి తెలంగాణకు 723 కోట్లు వన్ టైం గ్రాంట్ కింద ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోదించలేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లు 723 కోట్లను విడుదల చేయాలని మంత్రి హరీష్‌ రావు కోరారు.