తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులది కీలకపాత్రని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాన భవన్‌లో 31 జిల్లాల సమన్వయకర్తలు,119 నియోజకవర్గాల టీఆర్ఎస్‌వీ అధ్యక్షులతో భేటీ అయ్యారు హరీష్. ఈ సందర్భంగా వారికి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన కల్పించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారనుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు సాగు,తాగు నీరు అందుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర కీలకమైందని కొనియాడారు. బంగారు తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.
తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు సీఎం కావడం మన అదృష్టమన్నారు. పాలమూరు జిల్లాలో వలస పోయిన వారంతా తిరిగి తమ సొంత గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ గారు ఎంతో చేస్తున్నారని రాందేవ్ బాబా ప్రశంసించారని మంత్రి గుర్తు చేశారు.
రైతాంగానికి త్వరగా నీళ్లు ఇచ్చేందుకు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను చూసి వివిధ రాష్ట్రాల ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు హరీష్.