హుజురాబాద్‌లో కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఆటోనగర్ భూమిపూజ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 347 కుటుంబాలకు ఈ ఆటోనగర్‌లో ప్లాట్లు కేటాయించి వారికి శాశ్వత వర్క్ షెడ్లు కట్టిస్తున్నాం. మీరు అద్దెలు చెల్లించనవసరం లేకుండా ఇది మీకు శాశ్వత ఆస్తిగా ఉంటుందని తెలిపారు. టీఎస్ఐఐసీ ద్వారా ఆటోనగర్ కోసం 3 కోట్లు మంజూరు చేసాం. ఇక్కడ రోడ్లు, మంచినీరు, మరుగుదొడ్ల వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హుజురాబాద్ లోని మెకానిక్ లందరూ ఇక్కడే ఉండేలా చూసుకుంటే.. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు.
మేము ఆటోనగర్ కోసం హామీ ఇచ్చినప్పుడు మీకు అనుమానం ఉండేది. ఇంత వేగంగా అవుతుందా అనే అనుమానం మీకుండేది. మీకు సొంత స్థలాలు ఉంటే ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులిస్తాం. స్థలం లేని వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుంది. సీఎం పాలనలో సంక్షేమ యుగం నడుస్తోంది అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఆడపిల్లల పెళ్లికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. కానీ ఆడ పిల్లలకు సాయం అందిస్తోన్న దేశంలోని మొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్. చెప్పింది చెప్పినట్లు చేసుడే తప్ప.. మాట తప్పడం మాకు తెల్వదు. రేపురా.. మాపురా అనే ఉద్దెర బేరాలు మా దగ్గర ఉండవు అని మంత్రి తెలపారు.
గెల్లు శ్రీనివాస్ కు ఎన్నికల డిపాజిట్ కూడా మేమే కడుతామని మోటార్ వర్కర్స్ నేతలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. మీ అందరు కలిసి నామినేషన్ డబ్బులు కడుతామంటే మాకూ సంతోషమే అన్నారు. ఇక్కడ లబ్ధి పొందిన 347 మంది కలిసి, తలో 20 ఓట్లు టీఆర్‌ఎస్‌కు వేయిస్తారని ఆశిస్తున్నాం. బీజేపీ పాలనలో పెట్రోలు, డిజీల్, గ్యాస్ ధరలు పెరిగాయి. గ్యాస్ సబ్సిడీ తగ్గించారు. అయినప్పటికీ పువ్వు గుర్తుకే ఓటు వేస్తే.. సిలిండర్ ధర రూ. 1500 అవుతుందని మంత్రి తెలిపారు. బొట్టుబిల్లలు, గోడ గడియారాలు ఇస్తామన్న మాటలు ఆపేసి.. సిలిండర్ ధర, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని, సబ్సిడీ ఎప్పటిలాగే ఇస్తామని చెప్పండి అని బీజేపీకి సూచించారు మంత్రి.
బీజేపీ ప్రభుత్వం రైల్వేలు, ఎల్ఐసీ, విమానశ్రాయాలు, నౌకాశ్రయాలు అమ్మి, కుదవపెట్టి.. ఉద్యోగాలన్నీ ఊడగొడతారట. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పోరేట్ సంస్థల చేతిలోకి పోతే రిజర్వేషన్లు పోయి.. పిల్లలకు ఉద్యోగాలు ఊడుతాయి. బీజేపీ అనుబంధ కార్మికసంఘమైన బీఎంఎస్ కూడా ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తోంది. బీజేపీ కిసాన్ మోర్చా కూడా.. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తోంది. మరి ఆ పార్టీని సొంత మనుషులే తప్పు పడుతుంటే.. మనం ఎందుకు ఆ పార్టీకి ఓటు వేయాలి అని ప్రశ్నించారు. మీకు ఆటోనగర్ అనే అడ్డానిచ్చి.. మీ ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వం మాది అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.