రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20 వేల దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.శనివారం హుజూరాబాద్‌లోని సిటీ సెంటర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పైలట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ. 2 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ దళితబంధుపై బీజేపీ నేతలు అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి తప్పుబట్టారు.
హుజురాబాద్‌లో రైతుబంధు ఎలా ఒప్పైంది? దళితబంధు ఎలా తప్పైంది? అని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. రూ.50 లక్షలు ఇవ్వాలని బీజేపీ నేత బండి సంజయ్ డిమాండ్ చేశారని, తాము పది లక్షలు ఇస్తున్నాం, మిగతాది బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి తెప్పించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశంలో మరిన్ని నిధులు ఇచ్చి రాష్ట్రం అంతా ఇస్తామని మంత్రి ప్రకటించారు. కేంద్రం డబ్బులు ఇస్తే.. తాము కూడా పాలాభిషేకం చేస్తామని తెలిపారు. దళిత బంధును ఆపాలని ఈసీకి లేఖ రాశారని, కోర్టులో కేసు వేశారని హరీష్‌రావు విమర్శించారు.