బీజేపీ పాలనతోనే దేశంలో నిరుద్యోగం పెరిగింది- హరీష్‌

50
harish

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాష్ట్ర‌ ఆర్థికశాఖ‌ మంత్రి హరీష్‌ రావు సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో టీఆర్ఎస్ కార్యకర్తల‌ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో త‌మ ప్రచారాస్త్రాలని మంత్రి హరీష్‌ అన్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఎడాదికి కోటి చొప్పున ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ ఈ ఆరున్నరేళ్లలే ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాల‌న్నారు. ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణతో ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందన్నారు. దీంతో లక్షలాది మంది త‌మ‌ ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి జీడీపీ వృద్ధి రేటు‌ ఎనిమిది శాతం కన్నా ఎక్కువగా ఉంది. దాన్నీ బీజేపీ మైన‌స్ ఇరవై నాలుగు శాతానికి తీసుకెళ్లిందన్నారు. దీని వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ప్రతిష్టాత్మకమైన బీహెచ్ఈఎల్ మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. అదే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మాత్రం బీహెచ్ఈఎల్‌కు రూ. 30 ‌వేల‌కోట్ల విలువ గ‌ల‌ యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులు అప్పగించిన‌ట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఆసియాలోనే అతి పెద్ద 148 మెగా‌వాట్ల పంపు పనులు అప్పగించిందన్నారు. కేంద్రం కాని, దేశంలో ఏ రాష్ట్రం కూడా బీహెచ్ఈఎల్‌కు పనులు అప్పగించలేదని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.