గర్భిణుల ఆరోగ్యంపై ప్రతేక శ్రద్ధ చూపాలి- మంత్రి హరీష్‌

71
- Advertisement -

మంగళవారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కోహిర్ మండలం, బిలాల్ పూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ మాట్లాడుతూ.. ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. కంపౌండ్ వాల్ కూడా పూర్తి చేయమని అధికారులను ఆదేశిస్తున్నాను అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కొరత లేకుండా అన్ని రకాల మందులను పెడుతున్నాం. కుక్క కాటు, పాము కాటు, దగ్గు, జ్వరం.. ఏ రోగమైనా మందులు ఉన్నాయి. ఒక్క మందుల కోసమే బడ్జెట్‌లో రూ. 500 కోట్లు పెట్టుకున్నామని మంత్రి తెలిపారు.

కొహిర్‌లో 50 పడకల ఆసుపత్రి త్వరలో అందుబాటులోకి వస్తుంది. జహీరాబాద్‌లో రు. 11 కోట్లతో ప్రత్యేకంగా 50 పడకల మాతాశిశు ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి. అనవసరంగా సి సెక్షన్లు చేయించుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తుంది అని మంత్రి సూచించారు. పేదలు డబ్బులు ఖర్చు చేసుకొని, అనారోగ్యం బారిన పడకూడదని ప్రభుత్వం ఆలోచన అని అన్నారు.

4 ఏఎన్సి చెకప్స్ పక్కాగా చేయాలి, గర్భిణుల ఆరోగ్యంపై ప్రతేక శ్రద్ధ చూపాలి. బాలింతలు, గర్భిణులు రక్త హీనత భారిన పడకుండా ఆశాలు, ఏఎన్ ఎం, అంగన్ వాడీలు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీష్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, TSMSIDC ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -