డబుల్ బెడ్ రూం ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీశ్‌..

58
Minister Harish Rao

ఆదివారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట జిల్లా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మంత్రి హరీశ్‌ రావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో రూ.3 కోట్ల 72 లక్షల 40 వేల వ్యయంతో నిర్మించిన 56 డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రులు ప్రారంభోత్సవం చేశారు. పండుగ వాతావరణంలో మంత్రుల సమక్షంలో లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమంలోఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి. వెంకట్రామ్‌ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కరోనాతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో ఈ యాసంగిలో భూమికి బరువు పెరిగేంత వడ్ల దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు. యాసంగిలో ఎన్నడూ లేనివిధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.

గజ్వేల్‌లో 60 వేల ఎకరాలలో ఎండి పోయి పంటను కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లతో కాపాడుకున్నాం. కొడకండ్ల డబుల్ బెడ్ రూం కాలనీకి ప్రధాన రోడ్డు నుంచి బీటీ రోడ్డు, స్ట్రీట్ లైట్స్ వేయిస్తాం. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. కొడకండ్లలోని ఖాళీ రోడ్లను జీపీకి రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. కొడకండ్ల గ్రామంలోని రేషన్ లేని పేద ప్రజలకు రేషన్ కార్డు లు 15 రోజుల్లో అందిస్తాం. అర్హులకు ఆసరా పెన్షన్ లు అందిస్తామన్నారు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. అభివృద్ధి ప్రధాత సీఎం కేసీఆర్‌ వెంటే ప్రజలంతా ఉంటారు. ఆయన అడుగు జాడల్లో మేమందరం నడుస్తామని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల కండ్లలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. లబ్ధిపొందిన వాళ్లే ప్రభుత్వాన్ని విమర్శిస్తే సూర్యుడిపై ఉమ్మి నట్టే ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌.