సోమవారం హుజురాబాద్ పట్టణంలో చేనేత పారిశ్రామికులకు వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ కలిసి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చేనేత కార్మికులు త్విఫ్టు ఎంత కడితే అంతకు డబుల్ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. త్విఫ్టు కోసం రూ. 30 కోట్లు మంజూరు చేశామని హరీష్‌రావు పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం రూ. 73 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో చేనేత కార్మికుల కోసం రూ. కోటి 90 లక్షలు మంజూరు చేశామన్నారు. చేనేత సంఘం కార్మికులకు వచ్చే పెండింగ్ ఉన్న అన్ని రకాల డబ్బులను విడుదల చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ వచ్చాక చేనేత కార్మికులు తీసుకున్న అన్ని రకాల అప్పులు మాఫీ చేశామన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉంటుందన్నారు. రైతు బీమా తరహాలోనే మత్స్య, గౌడ, చేనేత బీమా రాబోయే రోజుల్లో రాబోతుందన్నారు. చేనేత కార్మికులకు అండగా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలాలు ఉన్న వారికి ఇండ్లు కట్టిస్తామన్నారు.