రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి ఆలయ సాంప్రదాయ ప్రకారం పాలక మండలితో కలిసి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు పాలకమండలి ఛైర్మన్‌గా నీల వెంకటేశం గుప్తాను సభ్యులు ఎన్నికున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి అన్ని విధాలుగా కేతకి సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. కొత్తగా ఏర్పడిన పాలకమండలి ధర్మం కాపాడుతూ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. నాలుగు రాష్ట్రాల నుండి భక్తులు దర్శనానికి వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో దేవాలయల నిధులు ప్రభుత్వాలు వాడుకున్నాయి, కానీ ఇప్పుడు ప్రభుత్వ నిధులు ఆలయాలకి ఇస్తుంది. యాదాద్రి, వేములవాడ, భద్రాద్రి ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
దేవాలయలలో పని చేసే అర్చకులకు ఏడాదికి 110 కోట్లు జీతాలు ఇస్తున్నాం. ప్రతీ ఏడాది దూపదీప నైవేద్యాల కోసం ఇరవై కోట్లు కేటాయిస్తున్నాం. అలాగే గ్రామాలు, మండలాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధికి 350కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. తెలంగాణలో 3647 దేవాలయాలకు ప్రతీ నెల దూప, దీప, నైవేద్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం పని చేస్తుంది. కాళేశ్వరం నీళ్లు ఝరాసంఘం తెచ్చి ఆ శివుడుకి అభిషేకం చేస్తామన్నారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జహీరాబాద్‌కు నీళ్లు ఇమ్మని త్వరలో సీఎంను కలుస్తామన్నారు. సీఎం కేసీఆర్ వైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. త్వరలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరుగుతాయి.ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా వారికి మంచి అవకాశాలు వస్తాయి. గోశాలకి నా జీతం నుండి లక్ష్మ నూట పదహారు ఇస్తున్నాను. గోవులను కాపాడాలి, నిత్యం పూజించాలి అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.