నేడు గచ్చిబౌలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్(తెలంగాణ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆసుపత్రిని అధికారులతో కలిసి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. గచ్చిబౌలిలో టీమ్స్ ఆసుపత్రిని 4-5 రోజుల్లో ప్రారంభిస్తాం. ఇప్పటికే గచ్చిబౌలిలో ఓపీ సేవలు నడుస్తున్నాయని మంత్రి తెలిపారు. అత్యంత అధునాతన సౌకర్యాలతో గచ్చిబౌలి ఆసుపత్రి సిద్ధమైందని ఆయన తెలిపారు. టిమ్స్‌లో 1224 బెడ్స్ సామర్ధ్యం ఉండగా.. 1000 బెడ్స్‌కి ఆక్సిజన్, 50 బెడ్స్‌కి వెంటిలేటర్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
కార్పొరేట్ ఆసుపత్రులలో లేనన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని అన్నారు. ఇంత అత్యాధునికమైన ఆసుపత్రి ఇంకా ఎక్కడా లేదని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగంలో అభివృద్ది సాధించామని ఈటెల అన్నారు. టిమ్స్ ఆసుపత్రిలో 15 ఫ్లోర్లు సిద్ధమయ్యాయని అన్నారు. క్యాంటీన్ ఇక్కడే ఉంటుందని పేషంట్లకు ఇక్కడే భోజనం సిద్ధం చేస్తామని అన్నారు. రెండు రోజుల్లో స్టాఫ్ రిక్రూట్ అయిపోతుందని మంత్రి వివరించారు.
ప్రజల ఆరోగ్య కోసం ఎంతో కృషి చేస్తున్నా.. కొందరు మాత్రం కావాలనే ప్రభుత్వంపై కుట్ర పూరితంగా బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గాంధీలో వేలాది మందికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తుందని..పేదల ప్రాణాలు కాపాడుతున్న హాస్పిటల్ గాంధీ. అక్కడ పని చేస్తున్న డాక్టర్స్, సిబ్బంది మనో స్థైర్యం దెబ్బతీయవద్దని తెలిపారు. సోషల్ మీడియాలో కామెంట్లు పేషెంట్లకు నష్టం చేస్తాయని మంత్రి అన్నారు.జిమ్మేదారీ లేని వాళ్ళు, భాద్యత లేని వాళ్ళు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాటిని నమ్మకండి అని మంత్రి ఈటెల పేర్కొన్నారు.

