వరదల నేపథ్యంలో ప్రజారోగ్యంపై మంత్రి ఈటల సమీక్ష..

73
minister etela rajendar

కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజలకు మేము ఉన్నామంటూ ధైర్యం చెప్పి కరోనా కట్టడిలో, చికిత్సలో అలుపెరుగని కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపిన మంత్రి ఈటల రాజేందర్.. వరదల కష్టకాలంలో కూడా ప్రజలకు అండగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పిలుపునిచ్చారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజా వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావుతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ 165 క్యాంపులను ఏర్పాటు చేసినట్లు మంత్రికి సూచించిన అధికారులు ఈ వైద్య క్యాంపులో డాక్టర్లు నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బంది 24 గంటలపాటు పని చేస్తున్నారు. వీటితో పాటు 46 మొబైల్ హెల్త్ క్యాంపులను కూడా ఏర్పాటు చేశామని వీటి ద్వారా అవసరం ఉన్న చోటికి వైద్య ఆరోగ్య శాఖ బృందాలు చేరుకొని వారికి పరీక్షలు నిర్వహించి మందులు అందజేసినట్లు  తెలిపారు.

వరదల నేపథ్యంలో కలుషిత నీటి వల్ల వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని జ్వరం ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి ఎప్పటికప్పుడు మందులు అందజేస్తున్నామని మంత్రి తెలియజేశారు. పునరావాస కేంద్రంలో ఉన్న వారికి ఇప్పటి వరకు 16 వేల మందికి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారందరికీ మందులు అందించామని తెలిపారు. క్యాంపులలో ఉన్నవారికి మాస్కులు శానిటైజర్ లు అందిస్తున్నాం. కరోనా లక్షణాలు ఉన్న వారికి ఇప్పటికి 2 వేల మందికి పరీక్షలు చేయగా వారిలో 19 మంది పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. వీరందరిని  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

అన్ని ప్రాంతాల నుంచి మెట్రో వాటర్ బోర్డ్ సహకారంతో వాటర్ శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని నీరు కలుషితం కాకుండా ఉండేలా క్లోరినేషన్ చేస్తున్నామని వరద నీటిలో చిక్కుకున్న ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నామని తెలిపారు. సీజనల్‌గా వచ్చే జ్వరాలు ఇతర ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి పిలుపునిచ్చారు. జ్వరం రాగానే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, హాస్పిటల్స్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని తగిన మందులు వాడాలి అని కోరారు. ఈ సమయంలో నీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలని.. వేడి వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.