వ్యాక్సిన్ కోసం ఎవరూ తొందర పడొద్దు అని సూచించారు మంత్రి ఈటల రాజేందర్. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఈటల…కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని స్పష్టం చేశారు. ప్రపంచానికి వ్యాక్సిన్ మన దేశం అందించడం గర్వకారణమన్నారు.
రాష్ర్ట వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైందని తెలిపారు. ప్రారంభంలో ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకాలు వేస్తామన్నారు. వైద్యారోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అని పేర్కొన్నారు.
కనిపించని శత్రువుతో ఇన్నాళ్లు యుద్ధం చేశామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రెండో దశలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తామని.. వ్యాక్సిన్ అందే వరకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తప్పనిసరిగా అందరూ టీకా రెండు డోసులు తీసుకోవాలి. రెండో డోసు తీసుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.