హైద్రాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యత గల ఉమ్మడి వరంగల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల కల్పనలో ముందంజలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అందులో భాగంగానే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, మహబూబాబాద్, ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కేంద్రాలను ( డయాగ్నస్టిక్ సెంటర్లు) ఈనెల 9వ తేదిన ప్రారంభించబడతాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు పరీక్ష చేసి మందులు రాస్తారు. కానీ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వైద్య పరీక్షల కోసం వేలాది రూపాయలు వ్యయం చేయవలసి వస్తుందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిలను అధిగమించి రోగులకు ఉచితంగా డాక్టర్లు వ్రాసిన పరీక్షలు ఉచితంగా చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రులలోని డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాలలో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా 150 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కేయంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా, సమీప జిల్లాలల్లోని ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ ఆసుపత్రిలో 9 ఔట్ పేషంట్స్ విభాగాల ద్వారా రోగులకు ఉచితంగా వైద్య సధుపాయాలు అందించబడుతున్నాయని మంత్రి తెలిపారు. దీనికి తోడుగా మరిన్ని సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. వరంగల్‌లోని యంజియం ఆసుపత్రిని అన్ని హంగులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ గారు నిర్ణయించారని మంత్రి తెలిపారు.
అందుకనుగుణంగా ప్రస్తుతం కేంద్ర కారాగారం ప్రాంగణంలో అన్ని హంగులతో యంజియం మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సంవత్సరంలోగా నిర్మించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగా కేంద్ర కారాగారంలోని ఖైధీలను రాష్ట్రంలోని ఇతర జైళ్లకు తరలించే ప్రక్రీయ త్వరలోనే పూర్తి కానున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. దీనికి తోడుగా ప్రస్తుతమున్న యంజియం ఆసుపత్రి ప్రాంగణంలో మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వరంగల్ నగరంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జిల్లా కేంద్రాల్లో వైద్య, ఆరోగ్య సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన తెలిపారు. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలతో పాటుగా నర్సింగ్ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరీ చేసిందని ఆయన తెలిపారు. దీని వల్ల మహబూబాబాద్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరడంతో పాటుగా, మెరుగైన వ్యైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు. దీనికి తోడుగా భూపాలపల్లి, మహబూబాబాద్‌లో ఔషధ ఉప కేంద్రాలను ఏర్పాటు వల్ల ఔషదాల సరఫరా మెరుగు అవుతుందని ఆయన తెలిపారు.
ప్రజలకు ఉచిత వైద్యం కోసం పలు పథకాలను ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో ప్రజారోగ్యం ప్రజలకు అందించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి మంత్రి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.