కోవిడ్ బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాలి- మంత్రి ఎర్ర‌బెల్లి

115
errabelli

కోవిడ్ బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించ‌డానికి వ‌రంగ‌ల్‌లోని మ‌హాత్మాగాంధి మెమోరియ‌ల్ ఆసుప‌త్రిలో 800 ప‌డుక‌ల‌ను ప్రత్యేకంగా కోవిడ్ బాధితుల కోసం కేటాయించ‌డం జ‌రిగింద‌ని, అందులో 650 ప‌డుక‌లకు ఆక్సిజ‌న్ సౌక‌ర్యాన్ని క‌లిగి ఉన్నాయ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. వ‌రంగ‌ల్‌లోని యంజియం ఆసుప‌త్రిని ఆయ‌న గురువారం ఆక‌స్మీకంగా త‌నిఖీ చేసి, కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్స‌ను ప‌రిశీలించారు. యంజియం ఆసుప‌త్రిలో కోవిడ్ బాధితుల‌కు అందుతున్న వైద్య సేవ‌ల‌ను, ఆసుప‌త్రిలో ఆక్సిజ‌న్‌, మందుల స‌ర‌ఫ‌రా ఎలా ఉందంటూ వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన చికిత్స అందించి ప్రాణాపాయం లేకుండా చూడాల‌ని వైద్యుల‌ను కోరారు.

అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యంజియం ఆసుప‌త్రిని ప్ర‌త్యేకంగా కోవిడ్ బాధితుల కోసం కేటాయించ‌డం జ‌రిగింద‌ని అన్నారు. రోగుల చికిత్స కోసం కావ‌ల‌సిన మందులు, ఆక్సిజ‌న్‌, నిల్వ‌లు ఉన్నాయ‌ని మంత్రి చెప్పారు. చికిత్స కోసం ప్ర‌త్యేకంగా వాడే రెమిడిసివేర్ ఇంజ‌క్ష‌న్లను తెప్పిస్తున్నామ‌ని, కోవిడ్ బాధితులను యంజియంలో చికిత్స కోసం చేర్పించాల‌ని కోరారు. ఆసుప‌త్రిలో డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బంది, పారిశుధ్ధ్య కార్మికులు నిస్వార్థంతో ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. యంజియంలో కోవిడ్ చికిత్స కోసం చేరిన కొంద‌రు రోగులు డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం వ‌ల్ల చనిపోతున్నార‌ని చేస్తున్న ప్ర‌చారంలో నిజం లేద‌న్నారు. కోవిడ్ బాధితులు ప్రైవేటు ఆసుపత్రిలోచేరి, అక్క‌డ ప్రాణాపాయ స్థితిలో ఉన్న చివ‌రి క్ష‌ణంలో యంజియం ఆసుప‌త్రికి చికిత్స‌కోసం వ‌స్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అందువ‌ల్ల కోవిడ్ సోకిన రోగులు ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరే బ‌దులు యంజియం ఆసుప‌త్రిలో చేరి మెరుగైన చికిత్స పొందాల‌ని ఆయ‌న సూచించారు.

యంజియం ఆసుప‌త్రిలో అంద‌రికీ ఉచితంగా మెరుగైన చికిత్స అందించ‌బ‌డుతుంద‌ని మంత్రి తెలిపారు. కోవిడ్ బాధితుల‌ను వారి కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలో వ‌దిలి వెళ్ల‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు వారి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకోవ‌డానికి వైద్యుల‌కు, పారామెడిక‌ల్ సిబ్బందికి, అందుబాటులో ఉండాలని మంత్రి ద‌యాక‌ర్‌రావు కోరారు. ప్రైవేటు ఆసుప‌త్రి యాజ‌మాన్యాలు కోవిడ్ చికిత్స కోసం అధిక ఫీజులు వ‌సూలు చేస్తున్నార‌న్న విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చిందని ఆయ‌న అన్నారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో వ‌సూలు చేస్తున్న ఫీజులు, వైద్య స‌దుపాయాలను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌రింగ్ చేస్తూ స‌మ‌న్వ‌యం చేయ‌డానికి ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాకు ఓ సీనియ‌ర్ ఐఏయ‌స్ అధికారిని నియ‌మిస్తున్న‌ట్లు చెప్పారు. యంజియం ఆసుప‌త్రిలో ప‌ర్య‌వేక్ష‌ణ‌కు జిల్లా వైద్యాధికారితోపాటు, జిల్లా పంచాయ‌తీ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌తో క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

వ‌రంగ‌ల్ యంజియంలో ఆసుప‌త్రిలో అందితున్న వైద్య సేవ‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ముఖ్య‌మంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ స‌మీక్షిస్తూ.. త‌గు ఆదేశాలు జారీ చేస్తున్నార‌ని తెలిపారు. క‌రోనా బాధితుల‌కు మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి నిరంత‌రం కృషి చేస్తున్న యంజియం సూప‌రిండెంట్ నాగార్జున‌ రెడ్డిని, డాక్ట‌ర్ల‌ను, పారామెడిక‌ల్‌, పారిశుధ్ధ్య సిబ్బందిని మంత్రి ఎర్ర‌బెల్లి అభినంధించారు. అమెజాన్‌ స‌హాకారంతో బాల‌వికాస స్వ‌చ్చంధ సంస్థ 25 అక్సిజెన్ కాన్సెంట్రేట‌ర్ల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు సమ‌క్షంలో యంజియం ఆసుప‌త్రికి అంద‌జేశారు. కోవిడ్ రెండ‌వ వేవ్ విస్త‌రిస్తున్నందున కోవిడ్ బాధితుల‌కు చికిత్స కోసం అక్సిజ‌న్ అవ‌స‌రం పెరిగిందని మంత్రి ఎర్ర‌బెల్లి అన్నారు. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితిలో తెలంగాణ రాష్ట్రానికి 100 ఆక్సిజ‌న్ కాన్సెంట్రేట‌ర్ల‌ను అందించేందుకు ముందుకు వ‌చ్చిన‌ బాల‌వికాస స్వ‌చ్చంధ సంస్థ‌ను, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌ శౌరీరెడ్డిని అభినంధించారు. కోవిడ్ భారి నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన స‌దుపాయాల క‌ల్ప‌న‌కు స్వ‌చ్చంద సంస్థ‌లు ముందుకు రావాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.