మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాల్‌లో పంచాయతీ రాజ్ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, జెడ్పి చైర్ పర్సన్ స్వర్ణమ్మ, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా, కమిషనర్ రఘునందన్ రావు, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్, డిఆర్డిఓ, డిపిఓ తదితరులు హాజరైయ్యారు.
ఈ సమావేశాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్థానిక సంస్థలు బలోపేతం అయ్యాయయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థలకు ప్రతి నెలా రూ.308 కోట్లు ఇస్తున్న ఘతన సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు ఇచ్చాం. ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన, శుద్ధి చేసిన నీటిని అందిస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి పల్లెకు నర్సరీలు, తడిపొడి చెత్తను వేరు చేసే డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు నిర్మితమవుతున్నాయని అన్నారు. అలాగే రైతుల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రైతు కల్లాలు, రైతులను సంఘటిత పరిస్తూ, చైతన్యం చేసే విధంగా 2,601 రైతు వేదికలు నిర్మితమయ్యాయని మంత్రి వివరించారు. పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెల రూపు రేఖలనే మార్చేసిందని మంత్రి తెలిపారు. నిత్యం జరిగే పారిశుద్ధ్యం ప్రజలను అంటు, సీజనల్ వ్యాధుల నుంచి కాపాడిందని, కరోనా వంటి మహమ్మారిని సైతం ఎదురించే విధంగా మార్చిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అలాగే, ప్రతి గ్రామంలోనూ అంతర్గత సిసీ రోడ్లు, గ్రామాల మధ్య లింకు రోడ్లు వేస్తున్నామని చెప్పారు.
తన సుదీర్ఘ 40 ఏండ్ల రాజకీయ, ప్రజాప్రాతినిధ్య జీవితంలో ఏనాడూ పల్లెల్లో ఈ స్థాయి అభివృద్ధిని చూడలేదని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మిషన్ భగీరథకు, నల్లా కనెక్షన్లకు, ఫ్లోరైడ్ రహిత నీటి సరఫరాకు, పారిశుద్ధ్య నిర్వహణకు స్వచ్ఛ అవార్డులు ఇలా అనేకానేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు వస్తూనే ఉన్నాయని మంత్రి తెలిపారు. నూటికి నూరు శాతం నల్లాల కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా నిన్ననే కేంద్ర మంత్రి ప్రకటిచారని మంత్రి ప్రకటించారు. అలాగే దేశ వ్యాప్తంగా మన స్కీములే అమలు అవుతున్నాయని.. మిషన్ భగీరథ పథకం జల్ మిషన్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్నది, జల్ స్వప్న పేరుతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ఇంకా బీహార్ వంటి అనేక రాష్ట్రాలు యథాతథంగా ఆ పథకాన్ని అమలు చేస్తున్నాయన్నారు. పల్లెలు అంటేనే రైతులని, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోలు, రుణాల మాఫీ, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్…. ఇలా అనేకానేక పథకాలు అమలవుతున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని మంత్రి వివరించారు.
ఇక సర్పంచ్ ల బాధలు నాకు తెలుసు. సర్పంచ్ లకు గతంలో ఎప్పుడూ లేనంతగా మంచి పేరు వచ్చింది. సర్పంచ్ లు కష్టపడితే ప్రభుత్వానికి పేరు వచ్చింది.టీం వర్క్ చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అనేక అవార్డ్ లు వచ్చాయి. గతంలో గ్రామాల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గుర్తు మంత్రి చేశారు. కొందరు సర్పంచ్ లు ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు చేయమంటున్నారు. అది చట్టంలో ఉన్నది. సాధ్య సాధ్యాలను సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. సర్పంచ్ ల జీతం పెంపు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతాం అన్నారు. ఇక త్వరలోనే కొత్త పెన్షన్ లు ఇచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులతోపాటు మహబూబూబ్ నగర్, వనపర్తి పంచాయతీ సమ్మేళనాల్లో గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితర స్థానిక ప్రజాపత్రినిధులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రంజెంటేషన్ ని తిలకించారు. అలాగే డ్వాక్రా మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వారి ఉత్పత్తుల స్టాల్స్ ని పరిశీలించారు. పాలమూరు మహిళా సమాఖ్యకు 15 కోట్ల రూపాయల చెక్కును అందచేశారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ ని మంత్రులు ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా అద్భుతంగా పని చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖల ఉద్యోగులు, అధికారులను, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలను అభినందించారు.