పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా వైరస్ తీవ్రత పెరిగింది… భయపడకండి… హోం ఐసోలేషన్‌లో ఉండండి. సర్కారు దవాఖానాలో ఇచ్చిన మందులు సరిగ్గా వేసుకోండి… కరోనా మహమ్మారిని జయించుదాం… అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సారి శ్రీ సీతారాముల కళ్యాణం చూడలేదని బాధ పడకండి… వచ్చే సారి ఆరోగ్యవంతంగా వుండి పండుగ జరుపుకుందాం… అంటూ, మరో వైపు బాధితుల కష్ట సుఖాలు తెలుసుకుంటూ.. తనదైన శైలిలో కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యులు, పోలీసులు తదితర అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి తీవ్రత పెరిగింది… ఉదయం యోగా, రోజుకు రెండు, మూడు సార్లు అవిరి పడుతూ స్వీయ నియంత్రణ పాటిస్తే కరోనాను జయించవచ్చు అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కరోనా బాధితుల కష్టాల్లో పాలుపంచుకోవాలన్నారు. కరోనా బాధితులు వేడి వేడి ఆహారం తీసుకోవాలన్నారు. కరోనా వందల సంఖ్య నుంచి వేల సంఖ్యకు పోయిందని.. జాగ్రత్తగా ఉండాలని.. మాస్కులు ధరిస్తూ స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.