టిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మరియు గ్రామీణ మంచినీటి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గంలోని 1,2,3,14,43,44,45 డివిజన్లలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వరంగల్ మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ జరుగని అభివృద్ది టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే జరుగుతుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరుగని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా మన ముఖ్యమంత్రి కేసిఆర్ నిలిచారన్నారు.
బిజేపి పాలిత రాష్ట్రాల్లో ఐదు వందల రూపాయల పెన్షన్లు కూడా ఇవ్వలేనివారు.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. బిజేపి మాయ మాటల పార్టీ , ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించింది, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఉన్న ఉద్యోగాలు ఊడగోట్టేందుకు రైల్వే, బియస్‌యన్ఎల్, ఏయిర్ పోర్ట్‌లు లాంటి కేంద్ర సంస్థలను ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లు ఎత్తేసి పేద వర్గాలకు అన్యాయం చేస్తుందన్నారు. కరోనా సమయంలోనూ ప్రజల సంక్షేమాన్ని మరిచి, తెలంగాణపై వివక్ష చూపిస్తుందన్నారు.
నాడు వరదలు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా సహాయం చేయలేని కేంద్రంలోని బిజేపి ప్రభత్వం. ఏ మొఖం పెట్టుకుని వస్తుందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడని బిజేపి దద్దమ్మలు ఓట్ల కోసం ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాను బిజేపి పాలిత రాష్ట్రాలకు మళ్లిస్తున్నారని అన్నారు. బిజేపి పాలిత రాష్ట్రాలకు ఓ న్యాయం.. మన తెలంగాణ రాష్ట్రానికి ఓ న్యాయమా అంటూ.. ఓట్ల కోసం వచ్చే బిజేపి వాళ్లను నిలదీయాలని పిలుపునిచ్చారు.
మన ప్రాంతం, మన నగరం అభివృద్దిపై మనకున్న ఆరాటం, ఆలోచన డిల్లి నాయకత్వానికి ఉంటుందా.. ఆలోచించాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నిలిపి ఆదర్శంగా నిలబెట్టాలన్న ప్రధాన ఎజెండాతో మన నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేటిఆర్ లకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. సమైఖ్య రాష్ట్రంలో నాటి టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెడలు వచ్చి సాధించుకున్న నర్మ్, హెరిటేజ్ పథకాలకు పేర్లు మార్చి.. బిజేపి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని అన్నారు. వరంగల్ నగరానికి ఒక్కపైసా ఇవ్వని బిజేపి, కాంగ్రెస్ పార్టీలు బోగస్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.