దేశానికే ఆద‌ర్శంగా మిష‌న్ భ‌గీర‌థ: మంత్రి ఎర్రబెల్లి

342
minister
- Advertisement -

దేశానికే ఆదర్శంగా మిషన్ భగీరథ నిలిచిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్రం అభినంద‌న‌ల నేప‌థ్యంలో…మిష‌న్ భ‌గీర‌థ పై ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించిన ఎర్రబెల్లి…. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న మిష‌న్ భ‌గీర‌థ పథ‌కం విధానం అన్ని రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలుస్తుంద‌న్న జాతీయ జ‌ల్ జీవ‌న్ మిష‌న్ డైరెక్ట‌ర్ మ‌నోజ్ కుమార్ సాహోకి కృతజ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.

మిష‌న్ భ‌గీర‌థ‌ త‌ర‌హాలో అమ‌లు చేస్తున్న జ‌ల్ జీవ‌న్ లోనూ ఫ్లో కంట్రోల్ వాల్వ్ ని వాడాల‌ని సూచించారు. తెలంగాణ మోడ‌ల్ ని అధ్య‌య‌నం చేయ‌డానికి సాంకేతిక బృందాల‌ను ఆ రాష్ట్రానికి పంపండి అని అన్ని రాష్ట్రాల‌కు లేఖ‌లు రాశారు. ఈ అధ్య‌య‌నం, మ‌నోజ్ సాహూ లేఖ‌, అంత‌కుముందు నీతి అయోగ్ సిఫార‌సు, 15వ ఆర్థిక సంఘం, అనేక సంస్థ‌లు, జ‌ల శాస్త్ర‌వేత్త‌లు, వివిధ రాష్ట్రాలు, సాక్షాత్తు ప్ర‌ధాని ప్ర‌శంస‌ల‌న్నీ కూడా మ‌న రాష్ట్రంలో సిఎం కెసిఆర్ గారి నేతృత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు అవుతున్న మిష‌న్ భగీర‌థ వియ‌వంతానికి నిద‌ర్శ‌నం అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలోని మంచినీటి కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఎండా కాలం వచ్చిందంటే చాలు. ఎక్కడ చూసినా నీటి ఎద్దడి. నల్లాలు, బోరింగుల దగ్గర శిగపట్లు. పానీ పట్లు. కిలో మీటర్ల కొద్దీ నడిచి వెళ్ళే పరిస్థితులు. ప్రజాప్రతినిధులకు ఖాళీ కుండలు, బిందెల ప్రదర్శనలు ఎదురయ్యేవి. అసెంబ్లీ జరిగితే చాలు… ప్రతిపక్షాలకు పండగే. నీటి సమస్యలను చూసి అసెంబ్లీని ఆలస్యంగా సమావేశ పరిచే దుస్థితులు ఉండేవి. ఇక సర్పంచ్ లకు ఎండా కాలం ఓ నరక యాతన. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఐదేళ్ళూ మంచినీటిని అందించడానికి పడే పాట్లతోనే గడిచిపోయేది. నల్లగొండ లాంటి జిల్లాల్లోనైతే ఫ్లోరైడ్ తో ఎముకల గూళ్ళైన జనాలు. ఆ మహమ్మారితో యుక్త వయసు రాక ముందే ముడుచుకుపోయిన శరీరాలతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. కావాలని చేసినా, చేయకపోయినా, ఆనాటి పాలకుల నిర్లక్ష్యం ఖరీదు తెలంగాణ ప్రజల నిండు ప్రాణాలు అన్నారు.

వెయ్యి కోట్ల బడ్జెట్ ఏ మూలకూ సరిపోయిది కాదు. అదనంగా రూ.50 కోట్లు ఖర్చు చేసినా, జెడ్పీ, మండల, గ్రామాలతోపాటు ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ నిధులెన్ని పెట్టినా సరిపోయేది కాదన్నారు. సుదీర్ఘ పోరాటంతో ప్రజల తెలంగాణ ఆరాటం తీరింది. అప్పటి ఉద్యమ నేత సిఎం కెసి ఆరే తెలంగాణ సీఎం అయ్యారు. అదే తెలంగాణకు కలిసి వచ్చింది. కన్నీటి కష్టాలు తీరడానికి ఆస్కారమిచ్చిందన్నారు.

30 ఏళ్ళ క్రితమే సింగూరు జలాలతో సిద్దిపేట ప్రజలకు ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించిన సీఎం కెసిఆర్ గారి సక్సెస్ ఫుల్ ప్రయోగమే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరికీ ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందించడానికి దోహదపడింది. అపర భగీరథుడిలా సిఎం కెసిఆర్ మిషన్ భగీరథ అపూర్వ పథకానికి అంకురార్పణ చేశారని తెలిపారు ఎర్రబెల్లి.

రూ.46,123 కోట్ల అంచ‌నా వ్య‌యంతో 99 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని 23,968 గ్రామీణ ఆవాసాలు, 120 ప‌ట్ట‌ణ‌, స్థానిక సంస్థ‌ల‌లో, రాష్ట్రంలోని మొత్తం 71ల‌క్ష‌ల 61వేల ఇండ్ల‌కు న‌ల్లాల ద్వారా స్వ‌చ్ఛ‌మైన మంచినీటిని అందించ‌డ‌మే ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. ఇందులోనూ 55ల‌క్ష‌ల 59వేల గ్రామీణ ఇండ్లు, 16ల‌క్ష‌ల 2వేల ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని ఇండ్ల‌కు మంచినీరు అందించ‌డం ప్ర‌ధాన ఉద్దేశ్యం అన్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం మిష‌న్ భ‌గీర‌థ ద్వారా రూ.29వేల కోట్ల వ్య‌యం తో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం అద‌న‌పు భారం ప‌డ‌కుండా…మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. కేవ‌లం ఆర్ ఓ ప్లాంట్ల ద్వారానే… నీటి కొనుగోలుకు ప్ర‌జ‌ల‌పై నెల‌కు క‌నీసం రూ.300 చొప్పున ఏడాదికి రూ.1800 కోట్ల భారం ప‌డేదని… మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని కేంద్రం స‌హా, అనేక రాష్ట్రాలు మ‌న రాష్ట్రానికి ప్ర‌తినిధుల‌ను పంపి, అధ్య‌య‌నం చేశాయన్నారు.

ఈ మ‌ధ్యే ప‌శ్చిమ‌ బెంగాల్ ప్ర‌భుత్వం రూ.56వేల కోట్ల‌తో జ‌ల్ స్వ‌ప్న పేరుతో మిష‌న్ భ‌గీర‌థ ప‌థకానికి శ్రీ‌కారం చుట్టామని…మ‌హారాష్ట్ర‌, బీహార్, ఒడిశా లాంటి అనేక రాష్ట్రాలు మ‌న ప‌థ‌కాన్ని వారి రాష్ట్రాల్లో అమ‌లు చేస్తున్నాయని చెప్పారు. మిష‌న్ భ‌గీర‌థ స్ఫూర్తితో కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ను ఏర్పాటు చేసింది. ఈ మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం దేశ వ్యాప్తంగా ఓ అధ్య‌య‌నం చేసిందన్నారు.

2021 నాటికి తెలంగాణ 100‌శాతం ప్ర‌జ‌ల‌కు మంచినీరు అందించ‌నున్న‌దని ఆ అధ్య‌య‌నం తేల్చిందని… అంటే సీఎం కెసిఆర్ క‌ల‌, ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో ఇంటింటికీ స్వ‌చ్చ‌మైన‌, మంచినీరు అందేది ఎంతో దూరంలో లేదని కేంద్ర ప్ర‌భుత్వ అధ్య‌య‌నం సారాంశం అన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 84కోట్ల 83ల‌క్ష‌ల ఇండ్లు ఉండ‌గా, అందులో 2020-21 ఏడాదికి కేంద్ర ప్ర‌భుత్వం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ కింద దేశంలోని 45ల‌క్ష‌ల మంచినీటి క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిందన్నారు.

అందులో మొద‌టి విడ‌త‌గా, అస్సాం, బీహార్, త‌మిళ‌నాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ప‌శ్చిమ బెంగాల్ ఈ ఐదు రాష్ట్రాల‌లోని ఐదు జిల్లాల‌ను ఎంపిక చేసిందన్నారు. కానీ, ఇప్ప‌టికే తెలంగాణ‌లోని 32 జిల్లాల్లో 23వేల 968 గ్రామీణ ఆవాసాలు, 120 ప‌ట్ట‌ణ, స్థానిక సంస్థ‌ల‌కు మిష‌న్ భ‌గీర‌థ నీరు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుందన్నారు.

అవార్డులు…రివార్డులు

() మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో వినూత్న ప‌థ‌కంగా మిష‌న్ భ‌గీర‌థ‌కు ఇప్ప‌టికే హ‌డ్కో మూడు సార్లు అవార్డులిచ్చింది
() జాతీయ వాట‌ర్ మిష‌న్ అవార్డులు -2019లో… తెలంగాణ నీటి వినియోగ సామ‌ర్థ్యాన్ని 20శాతం పెంచే విభాగంలో మిష‌న్ భ‌గీర‌థ మొద‌టి బ‌హుతి గెలుచుకుంది
() తేదీః 22-05-2016న‌ మ‌న్ కీ బాత్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత నీటిని అందించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం గొప్ప ప్ర‌య‌త్నం చేస్తున్న‌ద‌ని ప్ర‌శంసించారు.
() కేంద్ర ప్ర‌భుత్వం, భార‌త ప్ర‌ధాని, నీతిఅయోగ్, 15వ ఆర్థిక సంఘంతోపాటు, ప‌శ్చిమ బెంగాల్, బీహార్, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, మ‌ధ్య ప్ర‌దేశ్, ఉత్త‌ర ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క‌, ఒడిశా వంటి అనేక రాష్ట్రాలు తెలంగాణ మిష‌న్ భ‌గీర‌థ‌ను ప్ర‌శంసించాయి
() ఇంకా స్కోచ్ వంటి అనేక సంస్థ‌ల అవార్డులు, రివార్డుల‌కు లెక్క‌లేదు
() ఇదీ తెలంగాణ ఘ‌న‌త‌. ఇదీ తెలంగాణ సీఎం కెసిఆర్ సాధించిన ప్ర‌గ‌తి
()మిష‌న్ భ‌గీర‌థ‌కు రూ.15వేల కోట్లు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ కేంద్ర ప్ర‌భుత్వానికి రెక‌మండ్ చేసింది
() నేను స్వ‌యంగా 4సార్లు ఢిల్లీకి వెళ్ళిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ కేంద్ర ప్ర‌భుత్వం, ప్ర‌ధాని, మంత్రులు,అధికారులు అంతా ప్ర‌శంసించారు
()ఇంతా చేస్తే.. కేంద్ర ప్ర‌భుత్వం న‌యా పైస నిధులివ్వ‌లేదు. అవ‌స‌ర‌మైన ప‌థ‌కాల‌కు ఇవ్వ‌కుండా, అన‌వ‌స‌ర‌మైన ప‌థ‌కాలు ఇస్తూ…నాన్చివేత ధోర‌ణినే అవ‌లంబిస్తున్న‌ది
() చిన్నచిన్న‌ విష‌యాల‌పై రాద్ధాంతాలు చేసే, రాష్ట్ర‌ బిజెపి నేత‌లు ఇలాంటి ప‌థ‌కాల‌కు కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్ట‌వ‌చ్చుక‌దా?
() ఇలాంటి ప్రాజెక్టుల‌కు జాతీయ గుర్తింపు తేవ‌చ్చు క‌దా? కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌జ‌లు కాదా? తెలంగాణ ప్ర‌జ‌లు రాష్ట్ర బిజెపి నేత‌ల‌కు ప్ర‌జ‌ల్లా క‌నిపించ‌డం లేదా? నిజంగా మీకు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ఏమాత్రం ప్రేమ ఉన్నా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి నిధులు తీసుక‌రండి
() అభివృద్ధికి రాజ‌కీయాలు అద్ది…రాద్ధాంతాలు చేసి, మీరు ఎవ‌రి త‌ర‌పున‌, ఎవ‌రి కోసం? ఎందుకు మాట్లాడుతున్నారో..ఆత్మ విమ‌ర్శ చేసుకోండి. నిజంగా మీరు తెలంగాణ బిడ్డ‌లే అయితే. తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలన్నారు.

- Advertisement -