పదోన్నతుల జాబితాను సిద్ధం చేయాలి- మంత్రి

46
Minister Errabelli Review

పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీరింగ్ విభాగాలలోని వివిధ అధికారుల పదోన్నతులపై సంబంధిత అధికారులతో ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చించారు. మంత్రుల ఆవాసంలోని తన నివాసంలో శుక్రవారం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇ ఎన్ సి సంజీవరావు లతో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారం పంచాయతీ రాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల లోని వివిధ విభాగాలు, కేటగిరీల వారీగా ఆయా అధికారులు, ఉద్యోగుల పదోన్నతుల జాబితాలను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆయా శాఖలలోని మొత్తం ఉద్యోగులు, వారి నియామకపు తేదీలు, సీనియారిటీ జాబితా సిద్ధం చేసి పదోన్నతులకు అర్హత ఉన్న వారి జాబితాలను కూడా సిద్ధం చేయాలని సూచించారు. సీఎం ఎప్పుడు అడిగినా ఇవ్వడానికి అనుకూలంగా తయారు చేయాలని మంత్రి చెప్పారు. పదోన్నతులు వ్యవహారం పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. పదోన్నతులపై ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా భవిష్యత్తులో ఎవరికీ అన్యాయం జరగకుండా జాగ్రత్తగా జాబితాలు తయారు చేయాలని చెప్పారు.

పదోన్నతుల కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు సూచించారు. ఆయా జాబితాలను ఒకటికి రెండుసార్లు నిర్ధారించు కోవాలన్నారు. పదోన్నతుల వ్యవహారాన్ని ఒకరిద్దరు అధికారులకు అప్పగించినప్పటికీ పూర్తి పర్యవేక్షణ బాధ్యతను సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, ఈ ఎన్ సి సంజీవరావు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని కూడా మంత్రి ఆదేశించారు. వీలైనంత తొందరగా ఈ జాబితాలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు చెప్పారు.