ప‌ల్లెలు ప్ర‌గ‌తితో ప‌రిఢ‌విల్లాలి: ఎర్రబెల్లి

130
minister
- Advertisement -

ప‌ల్లెలు ప్ర‌గ‌తితో ప‌రిఢ‌విల్లాలి… ప్ర‌జ‌లు సంక్షేమంగా, సంతోషంతో… సుభిక్షంగా ఉండాలి. అందుకు ప్రజాప్ర‌తినిధులు, అధికారులు పాటు ప‌డాలి. స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాలి అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉద్బోధించారు. జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని దేవ‌రుప్పుల మండ‌లంలోని గ్రామాల వారీగా అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ఆయా గ్రామాల్లోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారాల‌పై స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు.

ఇందులో భాగంగా నిన్న ఆదివారం దేవ‌రుప్పుల మండ‌లంలోని 18 గ్రామాల అభివృద్ధిని స‌మీక్షించిన మంత్రి ఈ రోజు సోమ‌‌వారం దేవరుప్పుల మండలంలోని మిగ‌తా కోలుకొండ, రామచంద్రా పురం, చిన్న మాడురు, రంభోజి గూడెం, పెద్ద మడురు, నల్ల కుండ తండా, సింగరాజు పల్లె, బంజర, ధరావత్ తండా, నిర్మాల, రామ్ రాజు పల్లె, మాధా పురం, దేవుని గుట్ట తండా, తూర్పు తండా, దుబ్బ తండా, దేవరుప్పుల గ్రామాల అభివృద్ధిపై ఆయా గ్రామాల స‌ర్పంచ్ లు, ఎంపీటీసీలు, వార్డు స‌భ్యులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ముఖ్య నాయకుల‌తో పాల‌కుర్తిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో స‌మీక్షించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, గ్రామాల్లో అనేక సిసి రోడ్లు వేసినం. మురుగునీటి కాలువ‌లు నిర్మిస్తున్నాం. ప్ర‌తి గ్రామగ్రామాల న‌ర్స‌రీలు, త‌డి, పొడి చెత్త‌ల‌ను వేరు చేసే డంపు యార్డులు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, వైకుంఠ ధామాలు నిర్మిస్తున్నాం. ఇంకా రైతుల ఆత్మ‌గౌర‌వం పెంచే విధంగా ల‌క్ష‌ క‌ల్లాలు, రైతుల‌ను సంఘ‌టిత ప‌రిచేవిధంగా 2,601 రైతు వేదిక‌లు నిర్మిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఇవేగాక మ‌హిళ‌ల‌కు స్త్రీ నిధి ద్వారా అతి త‌క్కువ వ‌డ్డీరే రుణాలు అందిస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి ద్వారా అద్భుతంగా పారిశుద్ధ్యం నిరంత‌రం కొన‌సాగుతోంది. ఈ కార‌ణంగానే క‌రోనాని సైతం ఎదుర్కొన్నాం. సీజ‌న‌ల్ వ్యాధులు అదుపులోకి వ‌చ్చాయ‌ని మంత్రి తెలిపారు. ఇక ఇంటింటికీ మిష‌న్ భ‌గీర‌థ న‌ల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. ఇక రైతాంగం కోసం, కుల వృత్తుల‌ను ఆదుకోవ‌డం కోసం చేప‌ట్టిన అనేక ప‌థ‌కాలు ఉన్నాయ‌ని, ఆరోగ్య ల‌క్ష్మీ, క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్, కెసిఆర్ కిట్లు…ఇలా 600లకు పైగా ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్ర‌మేన‌ని మంత్రి తెలిపారు.

తెలంగాణ ఆవిర్భావానికి ముందు, కెసిఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌రిస్థితుల‌ను బేరీజు వేయండి. ఎంత మార్పు వ‌చ్చిందో చూడండి. ఎన్ని ర‌కాల ప‌థ‌కాలు అమ‌లు అవుతున్నాయో ప‌రిశీలించండి. వాట‌న్నింటినీ ప్ర‌జల్లోకి జోరుగా తీసుకెళ్ళండి. అని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మంత్రి తెలిపారు. అధికారంలోకి వ‌చ్చాక తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా మార్చి, లంబాడీల ఆత్మ‌గౌర‌వాన్ని పెంపొందించాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ల పై అసెంబ్లీ తీర్మానాలు చేసినం. పార్ల‌మెంట్ తీర్మానిస్తే త‌ప్ప‌, బిల్లు పాస్ కాని ప‌రిస్థితి. ఆ ప‌ని కేంద్ర ప్ర‌భుత్వం చేయాల్సి వుంద‌ని మంత్రి తెలిపారు.

ఇక లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చినం. అనేక ఉద్యోగాలు ర‌క‌ర‌కాల సాంకేతిక కార‌ణాల వ‌ల్ల నిలిచిపోతున్నాయి. అయినా వాటిపై న్యాయ‌పోరాటం చేస్తున్నాం. త్వ‌ర‌లోనే అవ‌న్నీ పూర్తి చేస్తాం. అలాగే, కొత్త‌గా మ‌రిన్ని ఉద్యోగాలు ఇవ్వ‌డానికి కృషి చేస్తున్నామ‌ని మంత్రి వివ‌రించారు. తాజాగా ఉపాధి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు బాగా పెంచినం, ఇంకా పెంచేందుకు కృషి చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.అలాగే కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌నితీరులో తేడాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని మంత్రి తెలిపారు. ఒక‌వైపు రాష్ట్రంలో రైతులకు అనుకూల‌, ఉప‌యోగ‌, శ్రేయోదాయ‌క ప‌థ‌కాలు అమ‌ల‌వుతుంటే, కేంద్ర ప్ర‌భుత్వం రైతు వ్య‌తిరేక నూతన వ్యవసాయ విధానాలు తెచ్చింద‌న్నారు. వ్య‌వ‌సాయ క‌నెక్ష‌న్ల‌కు విద్యుత్ మీట‌ర్ల‌ను బిగించేందుకు పూనుక‌న్న‌ద‌ని మంత్రి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు వివ‌రించారు.

ఈ అభివృద్ధిని ప్ర‌జ‌ల‌కు వ‌వ‌రించాల‌ని ప్రజాప్ర‌తినిధుల‌ను మంత్రి కోరారు. అలాగే, ఇంకా పెన్ష‌న్లు, ఇత‌ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌ని ప్ర‌జ‌లు, నిజ‌మైన‌, అర్హులైన నిరుపేద‌లుంటే వారిని ఆదుకోవ‌డానికి చేయాల్సిన‌దంతా చేయాల‌న్నారు. గ్రామాల మౌలిక వ‌స‌తుల‌ను ఏర్పాటు చేయ‌డంలో ప్ర‌జాప్ర‌తినిధులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిర్ల‌క్ష్యం చేయ‌డం త‌గ‌ద‌న్నారు. గ్రామాల్లో ప్ర‌ధానంగా అంత‌ర్గ‌త రోడ్లు, మురుగునీటి కాలువ‌లు, గ్రామాల మ‌ధ్య లింకు రోడ్లు, మంచినీటి వ‌స‌తిని మ‌రింత‌గా పెంపు చేయ‌డం వంటి అంశాల‌పై దృష్ట సారించాల‌ని చెప్పారు. ప్ర‌గ‌తిలో ఉన్న ఆయా ప‌థ‌కాల‌ను ప‌నుల‌ను వేగిరంగా పూర్తి చేయాల‌ని సూచించారు. ప్ర‌జా ప‌నుల విష‌యంలో ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

- Advertisement -