వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీసీ రోడ్లు,మురుగునీటి కాల్వలు,ఉపాధి హామీ పనులు,నర్సరీలో మొక్కల పెంపకం వంటి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…సీఎం కేసిఆర్ గ్రామాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అందుకే తీసుకున్నారని…పట్టణ ప్రగతి ద్వారా పట్టణాల ను బాగు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సర్వతో ముఖాభివృద్దికి సీఎం పని చేస్తున్నారని…అడగ్గానే సీసీ రోడ్ల పనుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్ల నిధులు ఇచ్చారని చెప్పారు.
గ్రామాల్లో సీసీ రోడ్ల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం లో ప్రజలు భాగస్వాములు కావాలని..పనులు నాణ్యంగా జరిగేట్లు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరీ రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.