సీఎం కేసీఆర్ దీక్షకు గుర్తుగా పైలాన్‌ ఆవిష్కరణ..

164
- Advertisement -

వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో రూ.10 లక్షలతో నిర్మించిన దీక్షా దివస్ పైలాన్‌ను ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరంగల్ చారిత్రక నగరం. ఈ నగరాన్ని చరిత్రలో నిలిచి పోయే విధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇలాంటి అభివృద్ధి గతంలో జరగలేదు. భవిష్యత్తులోనూ జరగబోదు. వరంగల్ మహా నగర కార్పొరేషన్ ఆవరణలో ఇప్పటికే మహాత్మా గాంధీ, అంబేద్కర్ వంటి మహామహుల విగ్రహాలను ఆవిష్కరించు కున్నాం. ఇప్పుడు తెలంగాణ సాధకులు, మన ముఖ్య మంత్రి కెసిఆర్ దీక్షకు గుర్తుగా పైలాన్‌ను ఆవిష్కరించుకోడం అదృష్టం అని మంత్రి తెలిపారు.

దీక్షా దివస్ పైలాన్ 10 లక్షల వ్యయంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ద్వారా నిర్మించబడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన మలిదశ ఉద్యమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నవంబర్ 29, 2009లో ప్రాణాలను ఫణంగా పెట్టి పదకొండు రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినారు. అనంతరం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తునట్లుగా ఆ నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ ప్రకటన తరువాత కేసిఆర్ దీక్షను విరమించారు.ఆ దీక్షకు గుర్తుగానే ఈ పైలాన్(స్థూపం) ని నిర్మించడం జరిగింది. ఆనాటి కేసిఆర్ దీక్ష స్ఫూర్తితోనే ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సుగమమైంది. జూన్, 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. సీఎం కెసిఆర్ గాంధీ స్ఫూర్తి తోనే శాంతి, అహింసా మార్గంలో తెలంగాణ సాధించారు. అంబేద్కర్ ఆశయాలతో పరిపాలన సాగిస్తున్నారు. గాంధీ, అంబేద్కర్‌ల స్పూర్తితో ఈ రోజు రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి అద్భుతంగా సాగుతున్నదని మంత్రి పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థలు బలోపేతం అవుతున్నాయి. ఇక్కడ ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండా ప్రకాశ్ తదితరులు అంతా ఒకప్పుడు కార్పొరేటర్లుగా పని చేసిన వారే..ప్రజలకు మంచి సేవలు చేస్తే, తప్పకుండా మంచి అవకాశాలు, ప్రజల ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఈ విషయాన్ని కార్పొరేటర్లు గుర్తు పెట్టుకోవాలి. త్యాగాల పునాదుల మీద మాత్రమే మనం నిలబడగలము. వరంగల్ గత ఏడాది కరోనా కారణంగా కాస్త వెనుకబడింది. ఇప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాము. కేంద్రం అమృత ప్రాజెక్టు కింద ఇచ్చింది కేవలం 200 కోట్లు మాత్రమే.. తెలంగాణ ప్రభుత్వం ఒక్క మిషన్ భగీరథ నీటి కోసం 1200 కోట్లు ఇచ్చింది. మిషన్ భగీరథ వంటి పథకం దేశంలో ఎక్కడ ఉందో చెప్పమనండి. ప్రతి నెలా వరంగల్ మహా నగర మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.75కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఆదేశించారని మంత్రి వివరించారు. ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి ఆదేశాలు ఇచ్చినం. ఉగాది నుంచి ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు.. ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పటికీ, తాను చంద్రబాబుని ఎదిరించి, ఒప్పించి అనుకూలంగా లెటర్ రాయించామన్నారు. ఉద్యమం ఉధృతం కోసం ఉద్యమకారులతో దాడులు చేయించుకున్నాను. అప్పట్లో కెసిఅర్‌తో కలిసి ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించాను. ఆనాడు తన పదవికి రాజీనామా చేయడానికి ఇప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిరాకరించారు. బండి సంజయ్ ఎక్కడున్నాడో తెలియదు. కేవలం ఉద్యమానికి భయపడి మాత్రమే తెలంగాణ వచ్చింది. ఇచ్చామని చెప్పుకుంటున్న, మద్దతు పలికామని చెప్పుకుంటున్న వాళ్ళు చేసిందేమీ లేదు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తామని నేను, కెసిఆర్‌తో చెప్పాను. ఆ మాట ప్రకారం నేను ఇప్పటికీ ఉన్నాను అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

- Advertisement -