సీఎం మార్పుపై కేసీఆర్‌ క్లారిటీ..

177
KCR
- Advertisement -

ఆదివారం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ భవన్‌లో రెండున్నర గంటలపాటు టీఆర్ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్‌ అధ్యక్షులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై పార్టీ నాయకులతో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎవరూ పోటీకాదని సీఎం కేసీఆర్‌ అన్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలు, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్సే గెలవాలని కేసీఆర్‌ పార్టీ నేతలకు సూచించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్టీ సభ్యత్వం విషయంలో లక్ష్యాన్ని పూర్తిచేయాలని కేసీఆర్‌ దిశానిర్ధేశం చేశారు.

ఇక సీఎం మార్పుపై వస్తున్న ఊహాగాలపై కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇంకా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని..పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. కొత్త సీఎం అంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సీఎం మార్పుపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. ఏప్రిల్‌లో టీఆర్‌ఎస్‌ భారీగా బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రారంభించాలని నేతలకు సూచించారు.

- Advertisement -