అర్హులందరు టీకాలు వేసుకోవాలి- మంత్రి ఎర్రబెల్లి

27
minister errabelli

శనివారం హంటర్ రోడ్, విష్ణుప్రియ గార్డెన్స్ లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ప్రమీల సత్పతితో, డీఎంహెచ్‌వో లలితా దేవి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూపర్ స్ప్రెడర్స్ కు ముందుగా టీకాలు ఇవ్వాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన బ్రహ్మాండమైందన్నారు. కరోనా కట్టడికి సీఎం తీసుకొంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి తెలిపారు. సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కరోనా టీకాలు అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ కల్లా రాష్ట్ర ప్రజలందరికి టీకాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం 20 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. అర్హులందరు తప్పకుండా టీకాలు వేసుకోవాలని మంత్రి విజ్ఙప్తి చేశారు.