ఆనందయ్యపై కేఏ పాల్ సంచలన కామెంట్స్..

41
KA Paul

కరోనాకు చికిత్సకు మందు తయారు చేసిన ఆనందయ్యకు క్రైస్తవ మతప్రబోధకుడు కేఏ పాల్ మద్దతుగా నిలిచారు. ఆనందయ్య గురించి ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ… కరోనా కారణంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని… ఇలాంటి సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారని ఆయన అన్నారు. వన మూలికలతో కరోనాకు మందును తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పారు.

ఆనందయ్య మందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రభుత్వ సంస్థలే చెపుతున్నాయని అన్నారు. ఆయన ఉన్న చోటుకి జాతీయ మీడియా వెళ్లి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కరోనా పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులు దారుణంగా దోచుకుంటున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయారని చెప్పారు. కరోనాకు ఇప్పటి వరకు సరైన మందు లేదని.. ఈ నేపథ్యంలో ఆనందయ్య తమతో చేతులు కలపాలని కోరారు. ఆనందయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఆనందయ్యతో కలిసి కరోనా మందు తయారీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని కేఏ పాల్ చెప్పారు. మందు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తెచ్చుకుంటే… మందు తయారీ చేసుకుని వెళ్లొచ్చని సూచించారు. మందు తయారీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు తాము చేస్తామని తెలిపారు. ఆనందయ్య బయటకు రాగానే అన్ని విషయాలను మాట్లాడతానని చెప్పారు. రక్షణ పేరుతో ఆనందయ్యను ఏపీ ప్రభుత్వం బంధించిందని మండిపడ్డారు. ఆనందయ్యను విడుదల చేయాలని సీఎం జగన్, డీజీపీ, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు సీజేఐ, సుప్రీం సీజేఐలను కోరండని కేఏ పాల్ సూచించారు.