మరింత పరిశుభ్రంగా, సర్వాంగ సుందరంగా వరంగల్ మహా నగరాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ నగర పారిశుద్ధ్యంలో భాగంగా రోడ్లను శుభ్రం చేయడానికి వీలుగా కొనుగోలు చేసిన రెండు స్వీపింగ్ మిషన్లను, కంప ట్రాక్టర్లు, షీ మొబైల్ టాయిలెట్స్ బస్సులను వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జెండా ఊపి మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, రూ.38 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో 193 పారిశుద్ధ్య వాహనాలు కొనుగోలు చేయడానికి నిర్ణయించగా, ఇప్పటికే అందులోని 75 వాహనాలు ఇప్పటికే వచ్చాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి స్మార్ట్ సిటీ నిధుల నుండి ఒక్కో మిషన్ కి రూ.2 కోట్లు వెచ్చించి, కొనుగోలు చేసిన రెండు యంత్రాలను మంత్రి ప్రారంభించారు. ఒక యంత్రం ఒక రోజుకి 40 కి.మీ. మేర, మూడు మీటర్ల వెడల్పుతో, 3 మీటర్ల ఎత్తుతో రోడ్లను పరిశుభ్రం చేస్తుంది. ప్రధాన రహదారులు, వాణిజ్య సముదాయాల పరిశుభ్రతకు ఈ వాహనాలు ఎంతో ఉపయోపగడతాయి. త్వరలోనే మరో పది యంత్రాలను రూ.7 కోట్ల 35 లక్షల వ్యయంత కొనుగోలు చేయడానికి ప్రతిపాదించడమైనది. పట్టణ ప్రగతి నిధులు రూ.26 కోట్ల 53 లక్షలతో 11 తడి, పొడి చెత్త వేరు చేసే యంత్రాలను కొనుగోలు చేయడానికి ప్రతిపాదించినట్లు మంత్రి వివరించారు.
సర్వాంగ సుందరంగా వరంగల్ నగరం..
త్వరలోనే వరంగల్ నగరాన్ని మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మురుగునీరు, వర్షపు నీరు నిలువ లేకుండా ఉండేట్లు, అలాగే పడక్బందీగా పారిశుద్ధ్యం నిత్యం జరిగేట్లు చేస్తున్నామన్నారు. గత సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లు, ఇతర వ్యవస్థలను బాగు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా తస్పతి, పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.