క‌రోనా నిర్మూల‌నలో ఎన్నారైలు భాగస్వాములు కండి..

152
errabelli
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో క‌రోన వ్యాధి నిర్మూల‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తుంద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న కృషిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్ర‌వాస భార‌తీయులు భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా నిర్మూల‌న‌కు చేస్తున్న కృషిలో ప్ర‌వాస భార‌తీయులను భాగ‌స్వాముల‌ను చేయ‌డానికి ఆయ‌న బుధ‌వారం రోజున అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ ( ఆటా ) ప్ర‌తినిధుల‌తో, జిల్లా క‌లెక్ట‌ర్లు, సైబ‌రాబాద్ సిటి పోలీస్ క‌మీష‌న‌ర్‌, వైద్యశాఖ అధికారుల‌తో జూమ్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

ఆటా లో తెలంగాణ‌కు చెందిన వారు ఎక్కువ‌గా ఉన్నార‌ని, తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిలో క‌రోనా క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి వివిధ రకాలుగా స‌హాకారం అందించాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌జారోగ్యానికి అత్యంత ప్రాధాన్య‌త ఇస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలో క‌రోనా నిర్మూల‌న‌కు తాత్కాలికంగా డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బందిని నియ‌మిస్తున్నార‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు కావాల్సిన సిబ్బందిని నియ‌మిస్తున్నామ‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు కావాల్సిన ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ముఖ్య‌మంత్రి కేసిఆర్ గారు రాష్ట్రంలో కోవిడ్ ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తూ కావాల్సిన సధుపాయాలు, ఔష‌ధాలు, ఆక్సిజ‌న్‌, డాక్ట‌ర్లు, పారామెడిక‌ల్ సిబ్బందిని స‌మ‌కూర్చ‌డం వ‌ల్ల రాష్ట్రంలో క‌రోనా అదుపులోకి వ‌స్తుంద‌ని, దిన‌స‌రి క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా వ్యాధి చికిత్స‌లో స్థానికంగా ల‌భించ‌ని ఆక్సిజ‌న్ ఫ్లోమీట‌ర్లు, ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌తో పాటుగా వెంటిలెట‌ర్ కంజుమ్‌బుల్స్‌, రెగ్యులేట‌ర్లు, ఆక్సిజ‌న్ మాస్కులు ఇత‌ర వ‌స్తువులు యంజియం, ఇత‌ర ఆసుప‌త్రుల‌లో ఆవ‌స‌రం ఉన్నాయ‌ని, అందువ‌ల్ల ఆటా బాధ్యులు వాటిని విరాళంగా అందించాల‌ని కోరారు. మాన‌వ సేవ‌యే, మాధ‌వ సేవ అని, అందువ‌ల్ల రాష్ట్రంలో క‌రోన నిర్మూల‌న‌కు ఆటా బాధ్యులు పూర్తి స‌హాయ, స‌హాకారాలు అందించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా నిర్మూల‌న‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న కృషికి తోడుగా మ‌న స‌హాయ‌, స‌హాకారాలు అంద‌జేస్తామ‌ని ఆటా ప్రెసిడెంట్ భువ‌నేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ రామ‌కృష్ణారెడ్డి, ఆటా బాధ్యులు కొత్త కాశిరెడ్డి, అనిల్ పొశెట్టి, శార‌ధ సింగిశెట్టి, సుధీర్ బండారు, ముర‌ళి బొమ్మినేని, హ‌నుమంత‌రెడ్డి, శివ‌కుమార్‌, ర‌వి, తిరుప‌తి, లోహిత్‌లు తెలిపారు. న‌ర్సంపేట శాస‌న‌స‌భ్యులు పెద్ది సుధ‌ర్శ‌న్‌రెడ్డి, సైబ‌రాబాద్ సిటి పోలీస్ క‌మీష‌న‌ర్ స‌జ్జ‌నార్‌, వ‌రంగ‌ల్ ఆర్భ‌న్ క‌లెక్ట‌ర్ రాజీవ్‌గాంధి హ‌నుమంతు, వ‌రంగ‌ల్ రూర‌ల్ క‌లెక్ట‌ర్ హ‌రిత‌, జ‌న‌గామ క‌లెక్ట‌ర్ నిఖిల‌, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్‌, మ‌హ‌బూబాబాద్ క‌లెక్ట‌ర్ వి.పి.గౌత‌మ్‌, నారాయ‌ణ‌పేట క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న త‌దిత‌రులు ఈ జూమ్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు.

- Advertisement -