వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్

31
kcr

కరోనా బారిన పడిన వారికి మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ శుక్రవారం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించనున్నట్లు సమాచారం. బుధవారం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ చికిత్స పొందుతున్న విధానం, సౌకర్యాలు, బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొని వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

మరో వైపు వారు చేస్తున్న సేవను అభినందించారు. అదే క్రమంలో వరంగల్ ఎంజిఎంలో కూడా సందర్శించి, మెరుగైన సౌకర్యాలు, బాధితుల్లో ధైర్యం నింపనున్నారు. గాంధీ ఆసుపత్రి సందర్శనలో ముఖ్యమంత్రి కేసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేవలం మాస్కులు మాత్రమే ధరించి సందర్శించి, కరోనా బారిన పడినా భయాందోళనలు వద్దని పరోక్షంగా చెప్పినట్లైంది. ఎంజిఎం సందర్శనకు కేసిఆర్ తో పాటు మంత్రి హరీష్ విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.