అభివృద్ధి పనులపై అధికారులు అప్రమత్తంగా ఉండి, నిర్ణీత కాలంలో వాటిని పూర్తి చేయాలని, ప్రజలకు ఆ పథకాలు సకాలంలో సమృద్ధిగా అందేలా చూడాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో ఆదివారం మంత్రి పలు అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలపై అత్యంత గౌరవంతో సిఎం కెసిఆర్, అనేక పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారని, అవన్నీ, ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. నిర్ణీత లక్ష్యాలకనుగుణంగా పనులు జరగాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపు యార్డులు, నర్సరీలు, రైతు వేదికలు, సిపి రోడ్లు, డ్రైనేజీలు, పిఎంజిఎస్ వై రోడ్లు, కొత్త రెవిన్యూ చట్టం, కొత్త వ్యవసాయ బిల్లు వంటి అనేక అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు.
అనంతరం రైతులకు పట్టాదారుపాసుపుస్తకాలు, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబాకర్ చెక్కులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.