కుల వృత్తులకు పూర్వ వైభవం: ఎర్రబెల్లి

92
Minister Errabelli
- Advertisement -

కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. బుధవారం పాలకుర్తి మండలంలోని గూడూరు చెరువులో మత్స్య శాఖ ద్వారా చేప పిల్లలు విడుదల చేసి, జిల్లాలో చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 7 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. పూర్వం నీళ్ళు, కరంటు గురించి ఎంతో ఇబ్బందిగా ఉండేదని, దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తిచేసుకొని 365 రోజులు నీటికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉన్నామన్నారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఎండాకాలంలోనూ నీరు అందించడం ముఖ్యమంత్రి కెసిఆర్ తోనే సాధ్యమైనదన్నారు. ఉచిత కరంటు, రైతు బంధు, రైతు భీమా వంటి పధకాలతో రైతులకోసం రెండు లక్షల యాభై వేల కోట్లు ఖర్చు పెడుతున్నది తెలంగాణా ప్రభుత్వమని అన్నారు. కరోనాతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతిందని, అయినా పేదల సంక్షేమ పధకాలు ఎక్కడా ఆపకుండా అప్పు తెచ్చి మరీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో రెండు వేల పదహార్లు ఇస్తుండగా, ఇతర రాష్ట్రాల్లో ఆసరా పెన్షన్లు రూ. 500, రూ. 600 మాత్రమే ఇస్తున్నారని, కరోనా సమయంలో అదీ ఇవ్వట్లేదన్నారు. వచ్చే నెల నుండి క్రొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు ఆయన అన్నారు. కుర్మ, యాదవులకు గొర్రెలు, గౌడలకు 17 శాతం బార్ షాపులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. దళితులకు దళిత బంధు క్రింద 10 లక్షల రూపాయలు వారి ఖాతాలో జమచేస్తున్నట్లు, పేదలందరినీ అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే సీజన్ నుండి సన్న వడ్లు పండించాలని ఆయన కోరారు. గూడూరు గ్రామంలో మాల కమ్యూనిటి హాల్ మంజూరుచేస్తున్నట్లు, కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ, 2021-22 సంవత్సరానికి ఉచిత చేప పిల్లల పంపిణి పధకం క్రింద జిల్లాలోని 786 చెరువులు, రిజర్వాయర్లలో 2 కోట్ల 82 లక్షల చేప పిల్లలు, వచ్చే నెలాఖరులోగా విడుదల చేయుటకు ప్రణాళిక చేపట్టామన్నారు. ఈ పధకం ద్వారా జిల్లాలోని 127 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో గల 13 వేల 696 మంది మత్స్యకార కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. ఈ పధకంతో చేపల స్వయం సమృద్ది జరుగుతుందని, మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో కృష్ణవేణి, డిపివో రంగాచారి, పాలకుర్తి ఎంపిపి నాగిరెడ్డి, జెడ్పిటిసి శ్రీనివాస రావు, గూడూరు గ్రామ సర్పంచ్ కొమురయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -