కేంద్ర నిధులు మరిన్నిరాబట్టడం ద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎంపీలు, కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారు. జనగామ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం జనగామ జిల్లా కలెక్టరేట్ లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కేంద్రం ద్వారా మన రాష్ట్రంలో అమలవుతున్న 26 రకాల వివిధ పథకాల్లో మనం ముఖ్యంగా ఈజిఎస్ పథకాన్ని ఎక్కువగా వాడుకుంటున్నామన్నారు. ఈ పథకంలో నిర్ణీత టార్గెట్లను పూర్తి చేసుకున్నామని, మరిన్ని నిధుల కోసం ఇప్పటికే కేంద్రాన్ని కోరామని చెప్పారు. ఇలాంటి పరిస్థితి మిగతా అన్ని పథకాల్లోనూ ఉండాలన్నారు. ముఖ్యంగా మనకు వచ్చిన నిధులను పూర్తిగా సకాలంలో వినియోగించడం, అవి అయిపోగానే, మరిన్ని నిధుల కోసం ప్రయత్నించడం జరగాలన్నారు.
అలాగే నిర్ణీత ఫార్మాట్లలో అత్యధిక నిధులు రాబట్టడానికి వీలుగా ఇక్కడి నుంచి కేంద్రానికి ప్రణాళికలు సిద్ధం చేసి పంపాలన్నారు. ఆయా నిధులు రాబట్టడానికి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) కి చైర్మన్ గా ఉన్న ఈ జిల్లా పరిధిలోని ఎంపీ, కో చైర్మన్ గా ఉన్న రాజ్యసభ సభ్యులు, సభ్య కార్యదర్శిగా ఉన్న కలెక్టర్ లు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఒకవేళే ఇతరత్రా అవసరమైన సాయం తాము చేస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ సాధ్యమైనంత మేర మనకు కేంద్రం ద్వారా వచ్చే నిధులు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారన్నారు. ఆ దిశగా ఈ దిశ నడవాలని ఆకాంక్షిస్తున్నామన్నామన్నారు. రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, పథకాలకు తోడు కేంద్ర ప్రభుత్వానివి తోడైతే మరింత అభివృద్ధిని సాధించడానికి వీలవుతుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాశ్, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా కెలెక్టర్ నిఖిల, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.