కాంగ్రెస్‌, బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు- మంత్రి ఎర్రబెల్లి

14
errabelli

సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ వెంటే వరంగల్‌ ప్రజలు ఉన్నారని, గ్రేటర్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలు కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనమని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం హన్మకొండ హరిత హోటల్‌లో మంత్రి సత్యవతిరాథోడ్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బండా ప్రకాశ్‌, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఇంచార్జి గ్యాదరి బాలమల్లు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రైతు రుణవిమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల పాల్గొన్నారు.

మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్‌పై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేలా మంచి స్థానాలు ఇచ్చిన వరంగల్‌ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నాయకత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై నమ్మకంతో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించారని మంత్రి తెలిపారు. టీఆర్‌ఎస్‌తోనే నగర అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతోనే పట్టం కట్టారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న ఆరు నెలల కాలంలో వరంగల్‌ రూపురేఖలు మార్చుతామని స్పష్టంచేశారు.అబద్దాలు, గాలి మాటలు మాట్లాడిన బీజేపీకి, మోసంపూరిత మాటలు మాట్లాడిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు.