రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం జనగామ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రంలో దేవరుప్పుల నుండి విస్నూర్ పీడబ్ల్యూడీ డబుల్ రోడ్,సింగరాజుపల్లి నుండి జీడికల్ వరకు డబుల్ రోడ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే దేవరుప్పుల మండలం సీతారాంపురంలో కస్టమ్ హైరింగ్ సెంటర్, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మండలంలోని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి. ఈ సందర్భంగా మంత్రికి కోలాటాలు, బతుకమ్మలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలతో రైతులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి ఎర్రబెల్లి కూడా మహిళలతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం హరిత హరంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. రైతులతో మాట్లాడి వరి ధాన్యం దిగుబడుల గురించి అడిగి తెలుసుకున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ ఇచ్చేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. ఇప్పటి వరకు కేంద్రంకు మనం ఇచ్చిన దాంట్లో సగం కూడా తిరిగి మనకు ఇవ్వలేదు. నలుగురు ఎంపీలు అందులో ఒక్కరు మంత్రి కూడా…వాళ్ళు రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం పోరాడరు. వాళ్ళు కేంద్రం నుండి ఏదో ఇస్తున్నట్టు…తెస్తున్నట్లు తెగ పోజులు కొడుతున్నారు. వాళ్ళు నలుగురు గెలిచి కేంద్రం నుండి ఏం ఇప్పించారో…శ్వేత పత్రం విడుదల చేయాలి. బీజేపీ వాళ్ళ ప్రగల్భాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వాళ్ళ నిజ స్వరూపం త్వరలో బయటపడుతుందని మంత్రి విమర్శించారు.
జనగామ జిల్లా ప్రజలు నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు వేసిన ఓట్లతో సీఎం కేసీఆర్ దయతో మంత్రిని అయ్యాను. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటాను. సంక్షేమంలో మనమే నెంబర్ వన్. రైతుల కోసం 23 వినూత్న, విశేష పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది. కరోనా కారణంగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. సీఎం కేసిఆర్ ముందు చూపుతో మన రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. రైతు మేలు కోరే ముఖ్యమంత్రి వున్నాడు కాబట్టే రైతు బంధు,రైతు భీమా,రైతు రుణ మాఫీ లాంటి 23 రకాల పథకాలు అమలు అవుతున్నాయి. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని మంత్రి తెలిపారు.
రైతులు పండించిన ఆఖరు గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇందుకు కూడా కేంద్రం అడ్డు పడుతున్నది. మద్దతు ధర ఎక్కువ పెట్టొద్దట. కేంద్రం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేయ బోమని ఎఫ్‌సీఐ అంటున్నది. రైతుల పంటలను కొనుగోలు చేయాలని సీఎం కేసిఆర్ అంటున్నారు. ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిజ రూపం. రాష్ట్ర అభివృద్దిని ఐక్య రాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం సైతం అభినందించినది. ప్రతి పేద ఇంటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి చెక్కులు అందించి ఆ కుటుంబాలకు పెద్దన్నగా సీఎం కేసిఆర్ భరోసాను ఇస్తున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి వుండటం మన అదృష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అండగా ఉండడం మన విధి. వచ్చే అన్ని సందర్భాల్లోనూ మన కోసం ఎంతో చేస్తున్న కేసిఆర్ కి అండగా ఉందామని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ నిఖిల, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.