పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ- మంత్రి ఎర్రబెల్లి

188
Minister Errabelli
- Advertisement -

పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ.. పల్లెలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకునేందుకు ప్రతిరోజు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరంతరం కృషిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం వరంగల్ అర్భన్, రూరల్ జిల్లాలకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో విడివిడిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జులై 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చాలేంజ్ గా తీసుకుని, విజయవంతం చేసేందుకు గ్రామ స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేసుకుని, సమస్యల పరిష్కారంతో పాటు, అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. గ్రామాభివృద్ధిలో నిర్లక్ష్యం వహించే సర్పంచులు, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైకుంఠధామాల, డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, హరితహారంలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రగతి సాదించిన మొదటి ఐదు గ్రామాలకు పారితోషకంగా అభివృద్ధి నిధులను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామంలోపటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిచడానికి కలెక్టర్లు, అడిషనల్ కల్లెక్టర్లు, ప్రజా ప్రతినిధులను, అధికారులను సమన్వయం చేయాలి. ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ప్రత్యెక అధికారిని నియమించి సర్పంచ్, యం.పి.టి.సి, వార్డు సభ్యులు, పంచాయితీ కార్యదర్శి, విద్యుతు శాఖ లైన్ మెన్, మిషన్ భగీరధ టెక్నికల్ అసిస్టెంట్ లతో ఒక కమిటీ ని ఎర్పాటు చేయాలి. రోజు వారీగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి గ్రామసభ నిర్వహించాలి. గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రగతి నివేదికను సమర్పించాలి. గ్రామంలోని కమిటీ లను ఆక్టివ్ చేయాలి.గ్రామ ప్రగతి నివేదిక కాపీలు గ్రామ సభలో పంపిణీ చేయాలి.దాతలను ప్రోత్సహించి వారి పేర్లు గ్రామ నోటిస్ బోర్డు లో పెట్టాలి.సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు సేవలను వినియోగించుకోవాలి.యువకులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేవిధంగా చేయాలి. నిధులను సక్రమంగా వినియోగించి వాటి వివరాలు గ్రామ సభలో తెలియజేయాలని మంత్రి సూచించారు.

పారిశుద్ధ్యం :
అన్ని రహదారులు గుంతలు లేకుండా చూసుకోవాలి. మరియు రోజువారిగా వాటిని శుభ్రం చేయాలి.గ్రామంలో శిథిలాలు లేకుండా చూసుకోవాలి. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఇండ్లను తొలగించాలి.పాత బావులను పూడ్చాలి.గ్రామపంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఇంటి నుండి రోజు చెత్తను సేకరించాలి. మైకు పెట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళాలి. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేయాలి.అన్ని డ్రైనేజీలను శుభ్రపరచాలి.పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు మరియు మార్కెట్ లాంటి ప్రభుత్వ స్థలాలలను శుభ్రంగా ఉంచాలి మరియు మరుగుదొడ్లను రోజువారిగా పరిశుభ్రంగా ఉంచాలి. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. పెరిగిన అవాంఛిత మొక్కలు, పిచ్చి మొక్కలను రోజు తొలగించాలి.గ్రామంలోని అన్ని బహిరంగ ప్లాట్లు చెత్తతో నిండకుండా, ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలి.గ్రామంలోని అందరూ కూడా తడి, పొడి చెత్తను వేరు చేసేలా చేయాలి.

ఆరోగ్యం:
తాగునీటి ట్యాంక్ లను శుభ్రపరచడం మరియు క్లోరినేషన్ చేయాలి.లీకేజీలు ఉన్న పైప్‌లైన్‌లు మరియు నళ్లాలను సరిచేయాలి. నీటి నిలువ ఉన్న ప్రదేశాలలో దోమల నివారణ రసాయనాలు చల్లటం, ఫాగింగ్ చేయటం చేపట్టాలి.సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

గ్రామ మౌళిక సదుపాయాలు :
అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలి.ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో అన్ని వైకుంఠధామాలు మరియు డంపింగ్ యార్డులకు బయో ఫెన్సింగ్, మొక్కల పెంపకం పూర్తి చేయాలి. డంపింగ్ యార్డులు మరియు వైకుంఠధామాలకు ఎక్కడైతే భూమి అందుబాటులో లేదో మరియు ప్రభుత్వ స్థలం ఇవ్వడం సాధ్యం కానట్లయితే.. ఆలస్యం చేయకుండా వెంటనే భూమిని సేకరించాలి.

తెలంగాణకు హరితహారం :
ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున పంపిణీ చేసి, రశీదు తీసుకోవాలి. మరియు వాటికి సంబంధించిన రిజిస్టర్ ను పంచాయతీ సెక్రటరీ నిర్వహించాలి.మిగిలిన అన్ని పల్లె ప్రకృతి వనాల పనులు పూర్తి చేయాలి.అన్ని రహదారులలో, అంతర్గత రహదారులలో, సంస్థలలో, బహిరంగ ప్రదేశాల లేఅవుట్లలో మరియు ఖాళీ ప్రదేశాలలో 100 శాతం ప్లాంటేషన్ చేపట్టాలి.అన్ని అవెన్యు, కమ్యూనిటీ మరియు సంస్థాగత ప్లాంటేషన్లను సందర్శించాలి. మరియు పోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలి. అన్ని చెట్ల దగ్గర తవుటం పెట్టాలి. చెట్లకు ముళ్ళ కంప తో ఫెన్సింగ్ చేయాలి. మంకీ ఫుడ్ కోర్టు లు ఏర్పాటు చేయాలి.అన్ని మండల కేంద్రాలలో 10 ఎకరాలతో ‘‘బృహత్ పల్లె ప్రకృతి వనం’’ ఏర్పాటు చేసుకునేలా స్థలాలను వెంటనే గుర్తించి ఏర్పాటు చేయాలి.

పవర్ సప్లై సమస్యలు :
పల్లె ప్రగతి కార్యక్రమంలోని ఒక రోజును ‘‘పవర్ డే’’ గా పాటించాలి.ఆ రోజు వంగిన, విరిగిన మరియు తుప్పు పట్టిన పోల్స్ ను గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి పెట్టించాలి. కరెంటు పోలు వైర్లు ఇండ్ల మీదకి రాకుండా చూడాలి.ఎక్కడైతే వీధి దీపాల కొరకు 3 వ వైరు, మీటర్లు ఏర్పాటు చేయలేదో… అక్కడ వెంటనే అవి ఏర్పాటు చేయాలి. పెండింగ్ కరెంటు బిల్లులను గ్రామ పంచాయితీ చెల్లించాలి.

ప్రజా ప్రతినిధుల ప్రమేయం :
గౌరవ మంత్రి వర్యులు, ఎంపీలు, జెడ్పీ చైర్ పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాలుపంచుకోవాలి.

ఉపాధి హామీ పథకం :
మన రాష్ట్రం ఉపాది హామీ అమలులో మొదటి స్థానంలో ఉంది. పూర్తిస్థాయిలో ఉపాది కల్పించడానికి లేబర్ కాంపోనెంట్ ను గరిష్టంగా వినియోగించుకోవాలి. అందుకు తగిన చర్యలు చేపట్టాలి.

పర్యవేక్షణ :
కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని నిశితంగా పర్యవేక్షించాలి. రోజువారి పర్యటనలు మరియు తనిఖీలు చేయాలి. పంచాయతీ కార్యదర్శి రోజువారీ పురోగతి నివేదికను ఈ- పంచాయతీ వెబ్ సైట్ లో కూడా అప్ లోడ్ చేయాలి. డి.పి.ఓ లు, యం.పి.డి.ఓ లు, డి.ఎల్.పి.ఓ లు మరియు యం.పి.ఓ లు నిరంతరం పర్యవేక్షించాలి.పెండింగ్ లో ఉన్న నిధులన్నీ రూ. 1000 కోట్లు విడుదల చేయడం జరిగింది. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం అత్యవసర నిధులుగా మంత్రుల వద్ద రూ. 2 కోట్లు, జిల్లా కలెక్టర్ల వద్ద రూ. 1 కోటి రూపాయలు ముఖ్యమంత్రి కేటాయించినారు. యం.ఎల్.సిలు, యం.ఎల్.ఎలు తమ నియోజకవర్గ నిధులను స్థానిక జిల్లా మంత్రి ఆమోదంతో వినియోగించుకోవచ్చు అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

- Advertisement -