గెలుపు తథ్యం.. మెజారిటీ ముఖ్యం..

130
minister errabelli
- Advertisement -

వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో వరంగల్ సికెఏం కాలేజీ గ్రౌండ్‌లో సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ లు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, టీఆరెఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జి గ్యాదరి బాల మల్లు, మేయర్ గుండా ప్రకాష్ రావు, మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, పలువురు నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్ ఓటర్లు మంచి చెడులను విశ్లేషించుకోవాలి. సీఎం కెసిఆర్ రాష్ట్రంలో చేస్తున్నది, కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్నది అర్థం చేసుకోవాలి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలతో వాళ్ల మేనమామగా ఉన్నది సీఎం కెసిఆర్ అన్నారు. 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పింది ఇచ్చిందా?..ప్రతి ఖాతాలో 15లక్షలు పడ్డాయా?..పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గినయా? అని మంత్రి ప్రశ్నించారు. కంపెనీలు అన్ని అదానీ, అంబానీలకు అమ్ముతున్నారు. రైల్వే ప్లాట్ ఫారం చాయ్ వాలా.. మోడీ, రైళ్ళను, ప్లాట్ ఫారాలను కూడా అమ్మేశిండు.రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇంకెందుకు బీజేపీ? బీజేపీ ఎంపీ లు… ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చుకోలేదని మంత్రి దుయ్యబట్టారు.

కరోనా సమయంలో, వరదల సమయంలో ఎవరైనా బీజేపీ నేతలు కనిపించారా?..తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నది. మన పథకాలను అభినందిస్తారు.. కానీ, నయా పైసా ఇవ్వడం లేదు. పైగా పన్నుల రూపంలో మనం 2.72లక్షలు కడితే, మనం ఇచ్చింది కేవలం 1.50లక్షల కోట్లు మాత్రమే. భద్రకాళి దగ్గర చర్చకు రమ్మన్న బీజేపీకి కలెక్టర్ దగ్గరకు మీ కేంద్ర మంత్రితో రమ్మంటే ఒక్కరూ రాలేదు. బండి, గుండు ఇష్టమొచ్చినట్టు, పిచ్చి కూతలు కూస్తున్నరు. వాళ్ళ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ, పసుపు బోర్డు తెచ్చుకోలేని వాళ్ళు ప్రగల్బాలు పలుకుతున్నారు. పైగా రాష్ట్రానికి వచ్చే నిధులను కూడా అడ్డుకుంటున్నారు. అబద్ధాలు అదే పనిగా చెప్పి అయోమయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు.

రూపాయికే నల్లా కనెక్షన్లు ఇస్తున్నాం..పేదల మీద భారం రాకుండా చూస్తున్నాం..వచ్చే ఉగాది నుంచి వరంగల్ మహా నగరంలో ప్రతి రోజూ మంచినీరు ఇస్తున్నాం. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించే, పరిష్కరించే నేత. ఆయనకు ఓటు వేసి మంచి మెజారిటీ ఇవ్వాలి. గెలుపు తథ్యం… మెజారిటీ ముఖ్యం.. అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్టీ ఇంఛార్జి బాల మల్లుతో కలిసి జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళుర్పించారు.

- Advertisement -