ప్రశంసలేకాదు.. నిధులు కూడా ఇవ్వండి- మంత్రి ఎర్రబెల్లి

51
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధిచేసిన మంచి నీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ, యూనిసెఫ్ నిర్వహించిన నేషనల్ వాటర్ శానిటేషన్ హైజిన్ కాంక్లేవ్ 2022 సదస్సులో వర్చువల్ గా పాల్గొంటూ కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ప్రశంసించారు. దీనిపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న వివిధ పథకాల అమలపై కేంద్రం ప్రశంసలు చేయడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కోరారు.

ముఖ్యమంత్రి మానస పుత్రికయైన మిషన్ భగీరథ కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని 100 శాతం గ్రామీణ ఆవాసాలకు త్రాగునీటి సౌకర్యం కల్పించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా 23 వేల 930 గ్రామీణ ఆవాసాలోని 2 కోట్ల 5 లక్షల 70 వేల గ్రామీణ జనాభాకు 54 లక్షల 6 వేల నల్లా కనెక్షన్ల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించడం ద్వారా తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని ఆయన తెలిపారు. ఇంటింటికీ నల్లా పథకంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని, నిర్దేశించిన 2024 కంటే ముందే లక్ష్యాన్ని చేరుకుందని పలుమార్లు కేంద్రం ప్రశంసించి దేశంలోనే అన్ని రాష్ట్రాలు స్పూర్తి పొందాలని సూచించిందని ఆయన అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఎండ కాలం వస్తే చాలు, మహిళలు కుండలు పట్టుకొని కిలోమీటర్లు నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దురవస్థ అనుభవించేవారు. అదిలాబాదు, ఖమ్మం లాంటి అదివాసి ప్రాంతాలలో జనం కలుషిత జలాలు తాగి డయేరియా, ఇతర జబ్బుల వల్ల ఇబ్బంది పడేవారని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశంలో, పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం గడువునకు ముందే మిషన్ భగీరథ పథకాన్ని పూర్తి చేసి, ఈ పథకం క్రింద రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు శుద్ధిచేసిన సురక్షిత జలాలు ఇంటింటికి నల్లాల ద్వారా అందుతున్నాయని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో వివిధ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండడంవల్ల బంగారు తెలంగాణ సాకారమవుతున్నదని మంత్రి దయాకర్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలను ప్రశంసించడమే కాకుండా పథకాల అమలుకు కూడా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అందులో భాగంగా నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు రాష్ట్రానికి 19 వేల కోట్ల రూపాయలను మిషన్ భగీరథ అమలు కోసం నిధులు విడుదల చేయాలని మంత్రి కేంద్రాన్ని కోరారు.

- Advertisement -