ఆదివారం భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. అంబేడ్కర్ ముందు చూపు వల్లే మన దేశంలో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని.. ఈ రిజర్వేషన్ల ద్వారానే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి కొనియాడారు.
సీఎం కేసీఆర్ అంబేద్కర్ స్పూర్తితో, ఆయన ఆశయాలకు అనుగుణంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. 500 జనాభా కలిగిన పల్లెలను గ్రామ పంచాయితీలుగా చేసి అణగారిన వర్గాలకు సర్పంచ్‌లుగా అవకాశం కల్పించారని ప్రశంసించారు. అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని నామినేటెడ్ పోస్టులు, ప్రతినిధుల ఎన్నికలోను అన్ని వర్గాలకు సమంగా రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ గొప్ప అంబేద్కర్ వాది అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.