సామాజిక మాధ్యమాల దిగ్గజం ‘మెటా’ ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై చూపుతున్న తీవ్ర ప్రభావంపై అమెరికాలోని కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో సంచలనాత్మక న్యాయ విచారణ ప్రారంభమైంది. సైబర్ బుల్లీయింగ్, సెక్స్‌టార్షన్ (బెదిరించి బ్లాక్‌మెయిల్ చేయడం) వంటి దారుణాల వలన ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయిన 11 ఏళ్ల జియోవన్నీ, 13 ఏళ్ల బబ్బా, 14 ఏళ్ల ఎంగ్లిన్ సహా దాదాపు 600 మంది చిన్నారుల పేర్లతో ఉన్న బానర్లను పట్టుకుని బాధితుల తల్లిదండ్రులు ఆక్లాండ్ న్యాయస్థానం వెలుపల నిరసన వ్యక్తం చేశారు. మెటా తన యాప్‌ల పనితీరులో ప్రాథమిక మార్పులు తీసుకురావాలని, అలాగే బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు ఈ దావా వేశాయి.
పిల్లలను ప్లాట్‌ఫారమ్‌లకు బానిసలుగా (అడిక్ట్) చేసేలా ఫీచర్లను కావాలనే రూపొందించి, వాటివల్ల కలిగే తీవ్ర నష్టాలను సమాజం నుంచి దాచిపెట్టారని కాలిఫోర్నియా డెప్యూటీ అటార్నీ జనరల్ మెగాన్ ఓ నీల్ కోర్టులో వాదించారు. ఫెడరల్ చట్టాలను ఉల్లంఘిస్తూ, తల్లిదండ్రుల అనుమతి లేకుండానే 13 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల వ్యక్తిగత డేటాను మెటా నిరంతరం సేకరిస్తోందని ఆరోపించారు. పిల్లల మెదడు పరిణతి చెందని తీరును, వారి భావోద్వేగ బలహీనతలను మెటా తమ వ్యాపార లాభాల కోసం వాడుకుందని చెబుతూ — మెటా దృష్టిలో “పిల్లలే ఒక ఉత్పత్తులు ” అని జ్యూరీకి వివరించారు. ఫేస్‌బుక్‌లో 13 ఏళ్ల లోపు చిన్నపిల్లల ఖాతాలను నిలిపివేసినప్పటికీ, వారికే చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను మాత్రం కొనసాగనిచ్చారని ఉదాహరించారు.
మరోవైపు మెటా తరఫు న్యాయవాది పాల్ స్కిమిడ్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ, 13 ఏళ్ల లోపు పిల్లలు వయస్సు దాచి అబద్ధాలు చెబుతూ యాప్‌లను ఉపయోగిస్తున్నారని నెపాన్ని వారిపైనే నెట్టే ప్రయత్నం చేశారు. ప్లాట్‌ఫారమ్‌లను సురక్షితంగా మార్చడానికి మెటా నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. యు.ఎస్. డిస్ట్రిక్ట్ జడ్జి ఇవాన్ గొంజాలెజ్ రోజర్స్ ఆధ్వర్యంలో ఆరు వారాల పాటు సాగే ఈ విచారణలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సహా పలువురు ఉన్నతాధికారుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు.
Also Read:ఉరిశిక్షకు ప్రత్యామ్నాయం..సుప్రీం నో!

