ఉరితీతకు బదులుగా బాధితుడికి తక్కువ నొప్పితో కూడిన ఇంజెక్షన్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మన దేశంలో ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని పునరుద్ఘాటిస్తూ, ప్రస్తుతానికి ఉరితీత పద్ధతే కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 354(5) ప్రకారం అమలు చేస్తున్న ఉరిశిక్ష పద్ధతి చాలా దారుణమైనదని, మానవత్వానికి విరుద్ధమైనదని పేర్కొంటూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉరిశిక్ష అమలు సమయంలో మరణం నిర్ధారణ కావడానికి దాదాపు 40 నిమిషాల సమయం పడుతుందని, అదే ఇంజెక్షన్ లేదా కాల్చి చంపడం వంటి పద్ధతుల్లో 5 నిమిషాల్లోనే మరణం సంభవిస్తుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదమైన మరణం పొందడం ప్రాథమిక హక్కు అని ఆయన వాదించారు.
న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఈ అంశంపై వెలువడిన మూడు కీలక తీర్పులను విస్తృత ధర్మాసనానికి పంపాలన్న విజ్ఞప్తిని కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను కొట్టివేయడం అంటే భవిష్యత్తులో ఈ అంశంపై రాజ్యాంగబద్ధమైన సమీక్షలు జరగవని అర్థం కాదని కోర్టు తెలిపింది. ఉరిశిక్ష కంటే తక్కువ నొప్పితో మరణం కలిగించే శాస్త్రీయ, వైద్యపరమైన ఆధారాలు భవిష్యత్తులో లభిస్తే దీనిపై మళ్లీ పునరాలోచన చేయవచ్చని స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం భావిస్తే, ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ మార్గాలను సమగ్రంగా సమీక్షించడానికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. గతంలో అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని కోర్టుకు తెలిపారు. అయితే, ఉరిశిక్ష స్థానంలో ఇంజెక్షన్‌ను ఎంచుకునే అవకాశాన్ని ఖైదీలకే వదిలేయాలన్న సూచనపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, అది ఆచరణాత్మకంగా సాధ్యపడదని అఫిడవిట్ దాఖలు చేసింది.
Also Read:రామమందిర విరాళాల చోరీ..తుది నివేదిక
దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా మారడానికి ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఇది విధానపరమైన నిర్ణయమని కేంద్రం వాదించగా, నాంపల్లి/పాత పద్ధతులనే పట్టుకుని వేలాడటం సరైంది కాదని కోర్టు వ్యాఖ్యానించింది.

